Share News

బాకరాపేట ఘాట్‌రోడ్డులో లారీ దగ్ధం.. త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్

ABN , Publish Date - Aug 31 , 2026 | 07:44 AM

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని బాకరాపేట ఘాట్ రోడ్డు వద్ద ప్రమాదవశాత్తు ఓ లారీ దగ్ధమైంది. అప్రమత్తమైన డ్రైవర్ లారీ నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు.

బాకరాపేట ఘాట్‌రోడ్డులో లారీ దగ్ధం.. త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్

తిరుపతి, ఆగస్టు 31: చంద్రగిరి మండలంలోని బాకరాపేట ఘాట్ ‌రోడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నుంచి తిరుపతి వైపు వెళ్లే లారీ మార్గమధ్యంలో ప్రమాదవశాత్తూ కొండను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి అక్కడికక్కడే దగ్ధమైంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ త్రుటిలో తప్పించుకుని ప్రాణాలు నిలుపుకున్నారు.


వివరాల్లోకి వెళితే.. పైప్‌ల లోడ్‌తో ఓ లారీ మహారాష్ట్రలోని బరంపూర్ నుంచి తిరుపతి వైపు వెళ్తోంది. చంద్రగిరి సమీపంలోని బాకరాపేట ఘాట్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదవశాత్తూ కొండగుట్టను ఢీకొట్టింది. దీంతో లారీ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ చాకచక్యంగా లారీ నుంచి బయటకు దూకారు.


ఆ తర్వాత మంటలు వేగంగా వ్యాపించడంతో లారీ పూర్తిగా కాలిపోయింది. గమనించిన వాహనదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే లారీ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Aug 31 , 2026 | 07:50 AM