Share News

ఆర్థికమంత్రి భార్యపై చర్యలు ఉండవా?

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:27 AM

ఉపాధ్యాయులపై చిన్నపాటి ఆరోపణలు వస్తేనే సస్పెండ్‌ చేస్తున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భార్య 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారంటూ ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు బహిరంగంగా ఆరోపించినా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రశ్నించారు.

ఆర్థికమంత్రి భార్యపై చర్యలు ఉండవా?
PRTUS Stithapragna.jpg

  • టీచర్లను మాత్రమే సస్పెండ్‌ చేస్తారా?

  • మంత్రి భార్య 10 శాతం కమీషన్‌పై

  • సీఎం జవాబు చెప్పాలి

  • సమస్యల పరిష్కారంలో సర్కారు విఫలం

  • జాప్యం చేస్తే ప్రభుత్వం టీచర్ల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది

  • ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి వ్యాఖ్యలు

  • టీచర్లను మాత్రమే సస్పెండ్‌ చేస్తారా?

  • టీచర్లకు 1న జీతం తప్ప ఇంకేమిచ్చారు?

  • ఇందిరాపార్క్‌ వద్ద పీఆర్టీయూటీఎస్‌

  • మహాధర్నా.. వేలాదిగా వచ్చిన ఉపాధ్యాయులు

హైదరాబాద్‌/కవాడిగూడ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులపై చిన్నపాటి ఆరోపణలు వస్తేనే సస్పెండ్‌ చేస్తున్నారని, ఆర్థిక శాఖ మంత్రి భార్య 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారంటూ ఓ రిటైర్డ్‌ ఉపాధ్యాయురాలు బహిరంగంగా ఆరోపించినా ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్‌రెడ్డి ప్రశ్నించారు. మంత్రి భార్య 10 శాతం కమీషన్‌పై రాష్ట్ర ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. రెండున్నరేళ్లలో ఒకటో తారీకు జీతం ఇవ్వడం మినహా.. ఉపాధ్యాయులకు ఏమిచ్చారో చెప్పాలన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పీఆర్టీయూటీఎస్‌ ఆద్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. 2034 దాకా సీఎంగా తానే ఉంటానని రేవంత్‌రెడ్డి పదే పదే చెబుతున్నారని, అయితే అప్పటిదాకా ఆయన కొనసాగాలంటే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని అన్నారు. పాలిటెక్నిక్‌ విషయంలో కూడా ప్రభుత్వం తీసుకున్న తొందరపాటు నిర్ణయాలను పునఃపరిశీలించాలని కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాకముందు రెండు డీఏలు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 2023 చివరలో ఉద్యోగుల బకాయిలు రూ.4 వేల కోట్లు ఉండగా, ఇప్పుడు అవి రూ.16 వేల కోట్లకు చేరాయన్నారు. ఉద్యోగుల నుంచి నాలుగు వాయిదాలు కట్టించుకొని ఇప్పటికీ ఆరోగ్య పథకాన్ని అమలు చేయకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ముఖ్యమంత్రి మాటకు విలువే లేకుండా పోతోందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉపాధ్యాయులంతా రోడ్డెక్కుతారని, ప్రభుత్వం టీచర్ల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.


పీఆర్సీ వెంటనే ప్రకటించాలి..

పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ.. పీఆర్సీ, ఈహెచ్‌ఎస్‌, 2003 డీఎస్సీ ఉద్యోగులకు పాత పెన్షన్‌, సీపీఎస్‌ అధ్యయనానికి కమిటీపై ఇచ్చిన హామీలను మరిచిపోయారని విమర్శించారు. పీఆర్సీ నివేదికను ఆరు నెలల్లో ఇస్తామని చెప్పినా.. ఇప్పటికీ రాలేదన్నారు. వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి మూడే ళ్లు కావస్తున్నా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో లో సెంటీమీటర్‌ కదలిక కూడా లేదని మండిపడ్డారు. పీఆర్టీయూటీఎస్‌ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌ అధ్యక్షతన జరిగిన ఈ మహాధర్నాలో మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి, కోశాధికారి శ్రీనివా్‌సరెడ్డి, 33 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెప్టెంబరు 1ని సీపీఎస్‌ విద్రోహ దినంగా పేర్కొంటూ ఉపాధ్యాయులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి
భువనగిరి.. రణరంగం

మీ పోరాటాలు ప్రశంసనీయం

Updated Date - Sep 02 , 2026 | 04:29 AM