Share News

భువనగిరి.. రణరంగం

ABN , Publish Date - Sep 02 , 2026 | 03:57 AM

బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర దాడులు.. రెండో రోజూ కొనసాగాయి. భువనగిరిలో ఇరు వర్గాల కొట్లాట.. రణరంగాన్ని తలపించగా, వనపర్తితోపాటు వేర్వేరు ప్రాంతాల్లో బీజేపీ నేతల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి.

భువనగిరి.. రణరంగం
Congress Rally

  • రెండో రోజూ బీజేపీ, కాంగ్రెస్‌ పోటాపోటీ దాడులు

  • భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై బీజేపీ దాడి

  • సీఎం రేవంత్‌, ఎమ్మెల్యే చిత్రపటాలకు నల్ల రంగు

  • బీజేపీ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణుల ప్రతి దాడి

  • పలువురికి గాయాలు.. పోలీసుల లాఠీచార్జి

  • తార్నాకలో బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌ అరెస్టు

  • అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ నాయకుల నిరసన

(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)

బీజేపీ, కాంగ్రెస్‌ పరస్పర దాడులు.. రెండో రోజూ కొనసాగాయి. భువనగిరిలో ఇరు వర్గాల కొట్లాట.. రణరంగాన్ని తలపించగా, వనపర్తితోపాటు వేర్వేరు ప్రాంతాల్లో బీజేపీ నేతల ఆందోళనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని.. ఘర్షణలను నివారించారు. బీజేపీ నల్లగొండ అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అరెస్టు చేయగా.. బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మరోవైపు, కాంగ్రెస్‌ నేతలు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. రాహుల్‌గాంధీపై అక్రమంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారంటూ నిరసనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు.


భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడి

భువనగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నేతలు మంగళవారం దాడికి పాల్పడ్డారు. క్యాంపు కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ, వెనుకవైపు ప్రహరీ పైనుంచి లోపలికి దూకి కార్యాలయ కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. పూల కుండీలను పగులగొట్టారు. కార్యాలయం ఎదుట ఉన్న ఫ్లెక్సీపై సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి చిత్రపటాలకు నల్లరంగు పూశారు. ఇంతలో అప్రమత్తమైన పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకోగా, మరి కొందరు బీజేపీ కార్యాలయానికి వెళ్లి పోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. దాడి చేసిన వారిలో కొందరు బీజేపీ కార్యాలయంలో ఉన్నారని తెలుసుకుని, మూకుమ్మడిగా తరలివెళ్లారు. బీజేపీ కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ నాయకుడు కూర వెంకటేష్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంలోకి కోడిగుడ్లు విసిరారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసరడంతో కొందరికి గాయాలయ్యాయి. ఒక దశలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అక్షాంశ్‌యాదవ్‌ పోలీసు బలగాలతో అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు, ప్రతిదాడులకు పాల్పడవద్దంటూ కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఫోన్‌ చేసి వారించడంతో ఘర్షణ వాతావరణం సద్దుమణిగింది.


రాంచందర్‌రావు అరెస్టు.. రచ్చ

బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డిని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అడ్డుకున్నారు. తార్నాకలోని ఆయన నివాసంలోనే గృహ నిర్బంధంలో ఉంచేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘర్షణకు దిగడం.. ఉద్రిక్తతకు దారి తీసింది. చివరకు రాంచందర్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని.. గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వంచిత పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిర్భందాలు, ఆంక్షలు విధించినా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వెయ్యి రోజుల పాలనపై వేడుకలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజల హక్కులను హరిస్తోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు తోడు దొంగలని విమర్శించారు. కాగా, రాంచందర్‌రావు నల్లగొండకు వచ్చి వర్షిత్‌రెడ్డిని పరామర్శిస్తారన్న సమాచారంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా.. గేటుకు తాళం వేసి ఎవరినీ లోపలికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి పోలీసులతో దురుసుగా మాట్లాడటంతో ఒకానొక దశలో తోపులాట జరిగింది. రాంచందర్‌రావును అరెస్టు చేశారన్న సమాచారం వచ్చాక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, హైదరాబాద్‌లోని లోయర్‌ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం వద్ద బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. సికింద్రాబాద్‌ మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్‌గౌడ్‌తోపాటు వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడడంతో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. మరోవైపు.. వనపర్తిలో బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్‌ జిల్లా కార్యాలయం వద్దకు చేరుకుని.. కాంగ్రెస్‌ జెండాలను తొలగించి, అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చించివేశారు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఆందోళనకు ప్రతిగా కాంగ్రెస్‌ నాయకులు కూడా బీజేపీ కార్యాలయంపై దాడికి దిగే అవకాశం ఉందన్న సమాచారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు.. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్‌గౌడ్‌, రితేష్‌ రాథోడ్‌, అధికార ప్రతినిధి ప్రభా గౌడ్‌ తదితరులను పోలీసులు మలక్‌పేట పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈసందర్భంగా ఏలేటి మాట్లాడుతూ రాష్ట్రంలో నిర్బంధ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నిరసనలు

కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని నిరసిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. లోయర్‌ట్యాంక్‌బండ్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ రాహుల్‌గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రశ్నిస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. ఖమ్మంలో కాంగ్రెస్‌ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి, అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ధర్నా చేశారు. అలాగే, నేలకొండపల్లి, ఖమ్మం రూరల్‌, మధిర, సత్తుపల్లి, వైరా, కొణిజర్ల, తిరుమలాయపాలెం, ముదిగొండ మండలాల్లోనూ ఆందోళనలు నిర్వహించారు. రాహుల్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని నిరసిస్తూ మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు స్వర్ణ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిరసన చేపట్టారు. ఎన్ని కేసులు పెట్టినా రాహుల్‌ను ఆపలేరని మంత్రి జూపల్లి అన్నారు. నాగర్‌కర్నూల్‌లో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ధర్నాలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన రాహుల్‌గాంధీపై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు. వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ అయూబ్‌ ఆధ్వర్యంలో వెంకట్రామ జంక్షన్‌లో నిరసన తెలిపారు. నిజామాబాద్‌ డీసీసీ నగేష్‌ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఆందోళన చేపట్టారు. రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా లో వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. కాగా, బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మానుకోవాలని ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ అన్నారు. తన తల్లిపై దాడి చేశారంటూ నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వర్షిత్‌రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. నల్లగొండలో ఆయన మాట్లాడుతూ తమ సహనాన్ని బీజేపీ నాయకులు చేతకానితనంగా భావిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి

152 మీటర్లకు సమ్మతి తెలపండి

రాజీనామాకే మొగ్గు!

Updated Date - Sep 02 , 2026 | 03:57 AM