హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
ABN , Publish Date - Sep 18 , 2026 | 07:38 PM
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడాన్ని కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌రెడ్డి స్వాగతించారు. పార్టీ గుర్తుపై గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం ప్రజాభీష్టానికి వ్యతిరేకమని ఆయన అన్నారు.
హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి. కిషన్‌రెడ్డి స్వాగతించారు. ఈ తీర్పు కాంగ్రెస్‌కు గుణపాఠం, చెంపపెట్టు వంటిదని ఆయన వ్యాఖ్యానించారు.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం ప్రజాభీష్టానికి వ్యతిరేకమని కిషన్‌రెడ్డి అన్నారు. దానం నాగేందర్ కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే పార్టీ మారారని పేర్కొన్నారు. ప్రజల తీర్పుతో ఒక పార్టీ తరఫున గెలిచిన తర్వాత.. మరో పార్టీలో చేరే విషయంలో ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని కిషన్‌రెడ్డి అన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకుని ప్రజాకోర్టులో సమాధానం చెప్పాలని సూచించారు.
ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. దానం నాగేందర్‌పై అనర్హత వేటు ప్రజాస్వామ్య విజయమని పేర్కొన్నారు. ఇకనైనా స్పీకర్ పార్టీలకతీతంగా వ్యవహరించాలని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం వ్యవస్థలను ధ్వంసం చేయడానికి కాంగ్రెస్ వెనుకాడలేదన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని పేర్కొన్నారు.
Also Read:
కాంగ్రెస్ అభ్యర్థికి మమతా బెనర్జీ మద్దతు.. ఇంతలోనే అరెస్టు
విమానయాన ఖర్చులపై వైసీపీ దుష్ప్రచారం.. ప్రభుత్వ వర్గాల వివరణ