Share News

రెండేళ్లు దాటినా అమలుకు నోచని హామీలు.. అసెంబ్లీలో సర్కార్‌పై విరుచుకుపడిన హరీశ్ రావు

ABN , Publish Date - Mar 23 , 2026 | 05:50 PM

తెలంగాణ శాసనసభ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల దీన స్థితిని, అశోక్ నగర్‌లో జరిగిన లాఠీఛార్జీలను ప్రస్తావిస్తూ మహాకవి శ్రీశ్రీ రాసిన కవితను పేరడీ చేస్తూ చదివి వినిపించారు.

రెండేళ్లు దాటినా అమలుకు నోచని హామీలు.. అసెంబ్లీలో సర్కార్‌పై విరుచుకుపడిన హరీశ్ రావు
Telangana Assembly News

హైదరాబాద్, మార్చి23: తెలంగాణ శాసనసభ వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగుల దీన స్థితిని, అశోక్ నగర్‌లో జరిగిన లాఠీఛార్జీలను ప్రస్తావిస్తూ మహాకవి శ్రీశ్రీ రాసిన కవితను పేరడీ చేస్తూ చదివి వినిపించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి ఓటువేసిన యువత ఇప్పుడు రోడ్ల పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, గత బడ్జెట్‌లో ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని సంపూర్ణంగా అమలు చేయలేదని హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం కనీసం ఆత్మ విమర్శ చేసుకోవడం లేదని, గత హామీలు ఏమయ్యాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘‘డిప్యూటీ సీఎం భట్టి మాటలకు అర్ధాలే వేరులే’ అన్నట్లుగా సాగుతోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టకుండా రైతు బంధు ఇచ్చింది. ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న ఈ ప్రభుత్వం ఎన్నికల అజెండాలో, తొలి బడ్జెట్‌లో ప్రకటించినప్పటికీ దానిని రూ.12 వేలకు తగ్గించింది. నాట్లు వేసే సమయంలో ఇవ్వాల్సిన నగదును, పంట కోతల సమయంలో ఇస్తూ రైతులను పాలకులు ఇబ్బంది పెడుతున్నారు. గతంలో హామీలో ఇచ్చిన రూ.500 బోనస్‌ను ఈ యాసంగి సీజన్‌కైనా ఇస్తారా? ఇవ్వరా?. రైతులకు ప్రభుత్వం రూ.19,000 కోట్లు బకాయిపడింది. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని, రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. కానీ, ఒక్కసారి కూడా ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రారంభిస్తామని గత బడ్జెట్‌లో చెప్పారు. ఈ సారి ఆ ప్రస్తావనే లేదు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో భారీ స్కాం జరిగింది. 75 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వం నిర్దేశించిన అంచనా వ్యయం కంటే 4.9 శాతం అధిక మొత్తానికి టెండర్లు కట్టబెట్టారు. ఈ ప్రాజెక్టులో దాదాపు రూ.1,000 కోట్ల మేర అవినీతి జరిగింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో అవినీతిపై సిట్‌ వేయాలి’ అని అన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 06:43 PM