Share News

సింగరేణిపై కాంగ్రెస్ అక్రమాలు మరిన్ని బయటపెడతా: హరీష్ రావు

ABN , Publish Date - May 26 , 2026 | 05:51 PM

శంషాబాద్ సమీపంలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ స్కాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడి పాత్ర ఉందని ఆరోపించారు.

సింగరేణిపై కాంగ్రెస్ అక్రమాలు మరిన్ని బయటపెడతా: హరీష్ రావు
BRS MLA Harish Rao

హైదరాబాద్, మే 26: శంషాబాద్ సమీపంలోని 180 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ స్కాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్నిహితుడి పాత్ర ఉందని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సిట్, సీఐడీ విచారణ జరపాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యక్తికి సదరు భూమి అప్ప జెప్పి.. తప్పు చేసిన ఎమ్మార్వోను బదిలీతో సరిపెట్టారన్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి తహసీల్దారును వెంటనే డిస్మిస్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ స్కాం వెనుక సీసీఎల్ఏ ఉన్నాడా? కలెక్టర్ ఉన్నాడా? అంటూ హరీష్ రావు సందేహం వ్యక్తం చేశారు.


ఈ భూమి ప్రభుత్వానిదని ఆర్డీవో చెబుతున్నారని చెప్పారు. పై అధికారి చెప్పినా వినకుండా.. ఎమ్మార్వో మాత్రం ఇది ప్రైవేట్ భూమి అంటున్నారని హరీష్ రావు వివరించారు. ముఖ్యమంత్రికి సన్నిహితుల నుంచి ఒత్తిడి ఉన్నందునే తహసీల్దారును బదిలీ చేసి కాపాడుతున్నారని ఆరోపించారు. సీఎం సన్నిహితుల ఒత్తిడితోనే.. ఎమ్మార్వోపై చర్యలు తీసుకోకుండా ఏసీబీ అధికారులు వెనక్కి వచ్చారని ఆరోపించారు. సింగరేణిలో రూ.16 వందల కోట్ల విలువైన బొగ్గు మాయమైందని ఆందోళన వ్యక్తం చేశారు.


40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఎక్కడో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించాలని డిమాండ్ చేశారు. బొగ్గు ఉందో? లేదో? పరిశీలన కోసం అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు స్పష్టం చేశారు. 'కాంగ్రెస్ హఠావో - సింగరేణి బచావో'.. బొగ్గు గని కార్మికుల నినాదం కావాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణి స్కాంలకు గనిలా మారిందని అభివర్ణించారు.


నైనీ బ్లాక్ బొగ్గు గనుల టెండర్.. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని బయట పెట్టిందన్నారు. త్వరలో సింగరేణిపై కాంగ్రెస్ ప్రభుత్వ అక్రమాలు మరిన్ని బయటపెడతానని హరీష్‌రావు స్పష్టం చేశారు. అలాగే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించి‌న ఆర్టీసీ డ్రైవర్ అశోక్‌పై వేసిన సస్పెన్షన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ శాఖలో వేల కోట్ల రూపాయిల అవినీతి జరుగుతోందంటూ ఈ సందర్భంగా హరీష్ రావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వైఎస్ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి చురకలు

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు.. చెక్కులు అందజేసిన డీజీపీ

Read Latest TG News And Telugu News

Updated Date - May 26 , 2026 | 06:00 PM