వడివడిగా గౌరవెల్లి
ABN , Publish Date - Oct 04 , 2026 | 05:08 AM
గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు 98 శాతం పూర్తయ్యాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుమతులు సాధించి ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణలోనూ వేగం పెంచాలని సూచించారు.
ఇప్పటికే 98 శాతం పనులు పూర్తయ్యాయి
అధికారులతో సమీక్షలో మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ అనుమతులు సాధించి, గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని నీటిపారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో గౌరవెల్లి ప్రాజెక్టుపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో కలిసి మంత్రి ఉత్తమ్ సమీక్ష జరిపారు. గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు 98 శాతం మేర పూర్తయ్యాయని.. భూసేకరణ, పర్యావరణ అనుమతుల విషయంలో అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. డిస్ట్రిబ్యూటరీలు, ప్రధాన కాలువలు, పిల్ల కాలువల పనులు పూర్తి చేయాలన్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు రూ.1,343.59 కోట్లు ఖర్చు అయ్యాయని,దీంట్లో నిర్మాణ పనులకు రూ.886.76 కోట్లు, భూసేకరణ, పునరావాసానికి రూ.456.83 కోట్లు వెచ్చించామన్నారు.
ప్రాజెక్టు పూర్తి చేసేందుకు మరో రూ.114.38 కోట్లు అవసరమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండానే జలాశయ విస్తరణ చేపట్టడంతో ఈ అంశం జాతీయ హరిత ట్రైబ్యునల్‌కు (ఎన్‌జీటీ) చేరిందని, పర్యావరణ అనుమతి పొందే వరకు తదుపరి నిర్మాణ పనులు చేపట్టరాదని ట్రైబ్యునల్ ఆదేశాల వల్ల యథాతథస్థితి కొనసాగుతుందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. పర్యావరణ అంశాలతో ముడివడిన ప్రతిపాదనల తదుపరి పరిశీలనకు సంబంధించి సుప్రీంకోర్టు జూలై 29న ఇచ్చిన తీర్పుపై సమీక్ష సమావేశంలో చర్చించారు. కాగా, పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక, పర్యావరణ నిర్వహణ ప్రణాళిక, ప్రజాభిప్రాయ సేకరణ నివేదికలు, మూడు సీజన్లకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కేంద్ర పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసినట్లు అధికారులు వివరించారు.
ఈ నెల 8న మదింపు కమిటీ పర్యావరణ అనుమతి ప్రతిపాదనలను పరిశీలించనుందన్నారు. ఈ నెల 16న ఎన్‌జీటీలో జరగనున్న విచారణకు ముందే న్యాయపరమైన పరిణామాలు, నవీకరించిన ప్రాజెక్టు రికార్డులను ట్రైబ్యునల్ ముందుంచాలని అధికారులకు ఉత్తమ్ సూచించారు. జలాశయానికి అవసరమైన 3,870 ఎకరాల్లో ఇప్పటికే 3,850 ఎకరాలు సేకరించామని, మిగిలిన 20 ఎకరాలకు సంబంధించిన పరిహారాన్ని హైదరాబాద్‌లోని భూసేకరణ అథారిటీ వద్ద జమ చేసినట్లు పేర్కొన్నారు. కాలువల కోసం చేపట్టాల్సిన భూసేకరణకు జిల్లాలవారీగా గడువులు నిర్ణయించాలని సూచించారు. పరిహారం సమస్య పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
22ఏ నుంచి తొలగింపు.. నాలా కింద ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్లకు ఊరట
కొత్త ఆస్పత్రుల పనులు వేగవంతం చేయాలి.. నిర్మాణం పూర్తయ్యేలోపు సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలి
ఎస్‌ఐఆర్‌పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర ఆరోపణలు.. మోదీ, షానే సూత్రధారులు
Read Latest Telangana News And Telugu News