అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు..
ABN , Publish Date - Apr 21 , 2026 | 12:54 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ శివారెడ్డిని అరెస్టు చేసినట్లు హైదరాబాద్ గోల్కొండ డీసీపీ చంద్ర మోహన్ తెలిపారు. నిందితుడిని అఫ్జల్‌గంజ్, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు ఆయన వెల్లడించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంతర్రాష్ట్ర దొంగను అఫ్జల్‌గంజ్, హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేసినట్లు గోల్కొండ డీసీపీ చంద్రమోహన్ తెలిపారు. నిందితుడి నుంచి 17 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అతడిని కర్నూలు జిల్లా బుధవారపేటకు చెందిన శివారెడ్డిగా గుర్తించామని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 13న అనంతపురం నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో శివారెడ్డి దొంగతనం చేశాడని డీసీపీ తెలిపారు.
అర్ధరాత్రి వేళ ప్రయాణికులంతా నిద్రిస్తుండగా చోరీకి పాల్పడినట్లు డీసీపీ చంద్రమోహన్ చెప్పారు. హైటెక్ సిటీకి చెందిన డాక్టర్ కీర్తన అనే మహిళ బ్యాగును ఎత్తుకెళ్లాడని వెల్లడించారు. దొంగతనం అనంతరం జడ్చర్ల వద్ద బస్సు దిగి పరారయ్యాడని తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం సీసీటీవీ, టెక్నికల్ ఎవిడెన్స్‌తో నిందితుడిని ఏపీ వాసిగా గుర్తించామన్నారు. అతడిపై నిఘాపెట్టి కడప చిన్న చౌక్ వద్ద చాకచక్యంగా అరెస్టు చేశారన్నారు. దొంగ నుంచి 6.2 తులాల హారం సహా మొత్తం 17 తులాల బంగారం రికవరీ చేశామన్నారు.
శివారెడ్డి గతంలో ఓ ప్రముఖ సూపర్ మార్కెట్ సూపర్‌వైజర్‌గా పనిచేశాడని.. విలాసాలకు బానిసై దొంగతనాలు మెుదలెట్టాడని చంద్రమోహన్ తెలిపారు. నిందితుడిపై అనంతపురం, కర్నూలు, కడప, విజయవాడలో ఏడు పాత కేసులు ఉన్నట్లు గుర్తించామన్నారు. గతంలో భారీగా మొబైల్ ఫోన్లు చోరీ చేశాడని ఆయన పేర్కొన్నారు. కేసు త్వరగా ఛేదించిన పోలీస్ బృందాలను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ప్రైవేట్ బస్సుల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని డీసీపీ చంద్రమోహన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
తమిళ ప్రజల భవిష్యత్తు కోసమే చెన్నైకి వచ్చా: సీఎం చంద్రబాబు
దస్తగిరి హత్యపై ప్రభుత్వం సీరియస్.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్