గాంధీ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్.. లక్షకు విక్రయం, ఆరుగురి అరెస్ట్
ABN , Publish Date - Nov 21 , 2026 | 04:47 PM
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో పసికందు కిడ్నాప్ కలకలం రేపింది. గంటల వ్యవధిలోనే ఈ కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 21: నగరంలోని సికింద్రాబాద్‌లో గల గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్‌కు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును ఛేదించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ బీహార్ మహిళ ఏడు రోజుల క్రితం ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ పసికందును ఓ ముఠా కిడ్నాప్ చేయగా.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. పసికందును లక్ష రూపాయలకు ఈ ముఠా విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినట్లు పోలీసులు వెల్లడించారు. బీహార్ మహిళకు ఈ పసికందు మూడో కాన్పుగా జన్మించింది. మూడో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టిందని తెలుసుకున్న ముఠా.. మహిళను సంప్రదించారు. ముగ్గురు ఆడపిల్లలుంటే డబ్బులు వస్తాయని నమ్మించారు. అనంతరం పసికందును తీసుకుని పరారయ్యారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. కాగా.. సికింద్రాబాద్ డీసీపీ ఆధ్వర్యంలో కేసును ఛేదించినట్లు పోలీసుల బృందం వెల్లడించింది.