ఆంధ్రాలో నాకు అభిమానులు ఉన్నారు: వీహెచ్
ABN , Publish Date - Feb 28 , 2026 | 01:41 PM
తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కలిసి కోరారని మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) వెల్లడించారు. గత పదేళ్ల నుంచి తనకు ఏ పదవి లేదని గుర్తు చేశారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: తనకు రాజ్యసభ సీటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానాన్ని కలిసి కోరారని మాజీ ఎంపీ వి. హనుమంతరావు (వీహెచ్) వెల్లడించారు. గత పదేళ్ల నుంచి తనకు ఏ పదవి లేదని గుర్తు చేశారు. ఆయన పార్టీ కోసం.. ప్రజల కోసం తాను పని చేస్తున్నానని పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నేతలతో వీహెచ్ సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం వీహెచ్ విలేకర్లతో మాట్లాడుతూ.. రాజ్యసభ సీటు ఇవ్వాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరానన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ మహేశ్ కుమార్ గౌడ్ మీద తనకు నమ్మకం ఉందని తెలిపారు. తనకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రాజకీయాల్లో వయసుతో సంబంధం లేదని.. చాలా మంది పదవుల్లో ఉన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పార్టీ అధిష్ఠానం తనకు న్యాయం చేస్తుందని తనకు నమ్మకం ఉందన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేశానని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తుది శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు. ఎవరు పని చేస్తే వారికి పదవి అని సీఎం రేవంత్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సందర్బంగా వీహెచ్ ప్రస్తావించారు. ఈ పదేళ్లలో తనపై 16 కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు. దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి సహా పలువురు మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారంటూ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చి.. లొంగిపోయారన్నారు. ఏ విధంగా వారికి న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని తెలిపారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా తాను పని చేశానన్నారు. ఎక్కడ అన్యాయం జరిగిన అక్కడికి తాను వెళ్ళానని చెప్పారు. ఆంధ్రాలో సైతం తనకు అభిమానులు ఉన్నారని చెప్పారు. ఎక్కడైనా న్యాయం కోసం పని చేశానని.. అంతేకానీ నగదు కోసం ఎప్పుడూ పని చేయలేదని వీహెచ్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శారదా పీఠం భూములు హరీశ్ రావు ఆరోపణలు.. ప్రభుత్వం రియాక్షన్
హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ
For More TG News And Telugu News