Share News

మేడ్చల్‌లో నకిలీ జీఓలతో భూ దందా.. ముగ్గురి అరెస్ట్

ABN , Publish Date - May 29 , 2026 | 06:01 PM

మేడ్చల్‌లో నకిలీ జీఓలతో భూ దందా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

మేడ్చల్‌లో నకిలీ జీఓలతో భూ దందా.. ముగ్గురి అరెస్ట్
Medchal Land Scam News

మేడ్చల్: ఫేక్ జీఓలు, అక్రమ భూ ఒప్పందాల ద్వారా భారీ మోసానికి పాల్పడిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిమ్మల రాజేశ్ గౌడ్, నిమ్మల వేణుగోపాల్, నిమ్మల సాయికిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహా మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గండిపేట సర్వే నంబర్ 18లోని ప్రభుత్వ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించి, ఆ భూమిని తమదిగా చూపిస్తూ ఫేక్ జీఓలు తయారు చేసినట్లు దర్యాప్తులో తేలింది. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఈ నకిలీ జీఓలను వైరల్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


ప్రభుత్వం భూమిని క్రమబద్ధీకరించినట్లు చెబుతూ ఐదు ఫేక్ జీఓలను సృష్టించిన నిందితులు, ఆ భూమిని ఎకరాకు రూ.3.5 కోట్లకు అమ్మేందుకు కుట్ర చేశారు. ఈ భూమి డీల్‌లో బొల్లా రమేష్, బ్రహ్మనాయుడుతో ఒప్పందం కుదిరినట్లు దర్యాప్తులో బయటపడింది. బొల్లా బ్రహ్మనాయుడు నుంచి నిమ్మల ఫ్యామిలీకి రెండు విడతలుగా డబ్బు ట్రాన్స్‌ఫర్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఒకసారి కోటి రూపాయలు, మరోసారి 25 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. మొత్తం భూ లావాదేవీల్లో సుమారు నాలుగు కోట్లు చేతులు మారినట్లు దర్యాప్తులో తేలింది.


కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, బ్యాంక్ పాస్‌బుక్స్, మొబైళ్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. చట్టబద్ధ హక్కులు లేకపోయినా ప్రభుత్వ పోరంబోకు భూమిపై హక్కులు ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. హైకోర్టులో తమ భూమే అని నిందితులు పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ, అక్టోబర్ 2025లో వాటిని కోర్టు కొట్టివేసినట్లు తెలిపారు. అనంతరం కూడా అక్రమంగా భూమి అమ్మకానికి ప్రయత్నించినట్లు పోలీసులు చెప్పారు. ఫేక్ జీఓలు, ఫోర్జరీ పత్రాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. భూమి కొనుగోలు చేసే ముందు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సాధారణ పీఏ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి..? : పట్టాభి

ఆర్ఎమ్‌యూకి రైళ్ల తయారీ బాధ్యత.. ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు..

Updated Date - May 29 , 2026 | 06:45 PM