ఆర్ఎమ్‌యూకి రైళ్ల తయారీ బాధ్యత.. ప్రధానికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు..
ABN , Publish Date - May 29 , 2026 | 01:28 PM
కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్(RMU)కు 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్: కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్(RMU)కు 200 ఇంటర్‌సిటీ రైళ్ల తయారీ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పగించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నిరంతర సహకారం అందిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
రాబోయే ఐదేళ్లలో 200 ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై సమీక్ష నిర్వహించి, ఆ బాధ్యతను కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కు అప్పగిస్తూ రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్ణయం తీసుకోవడం హర్షనీయమన్నారు. ఈ ఇంటర్‌సిటీ రైళ్లు 20 కోచ్‌ల కాన్ఫిగరేషన్‌తో, ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్, సురక్షితమైన కోచ్ డిజైన్ వంటి ఆధునిక సదుపాయాలను కలిగి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. వీటిని సాధారణంగా సుమారు 300 కిలోమీటర్ల దూరం ఉన్న మార్గాల్లో నడిపిస్తారని తెలిపారు. అలాగే ప్రతి ట్రిప్‌లో చాలా స్టాప్‌లు ఉంటాయని కేంద్ర మంత్రి చెప్పారు.
ఇంటర్‌సిటీ రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల మధ్య ప్రజలు సులభంగా ప్రయాణించేందుకు ఈ రైళ్లు ఉపయోగపడతాయని అన్నారు. ఇవి తమ సమీప పట్టణాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉంటాయని చెప్పారు. అలాగే ఆరోగ్యం, ఉద్యోగం, ఉపాధి కోసం ప్రయాణించే సామాన్య ప్రజలకూ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు