సాధారణ పీఏ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి..? : పట్టాభి
ABN , Publish Date - May 29 , 2026 | 02:53 PM
లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు కోట్ల రూపాయిలు దోచుకున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ విమర్శించారు. ఈ స్కామ్‌లో వేళ్లన్నీ తాడేపల్లి పెత్తందారుల వైపే చూపిస్తున్నాయని మండిపడ్డారు.
అమరావతి, మే29: లిక్కర్ స్కామ్‌లో వైసీపీ నేతలు కోట్ల రూపాయిలు దోచుకున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్ విమర్శించారు. ఈ స్కామ్‌లో వేళ్లన్నీ తాడేపల్లి పెత్తందారుల వైపే చూపిస్తున్నాయని మండిపడ్డారు. గొడ్డలి పార్టీకి P4 పథకం ఉందన్నారు. అవే.. పవర్, ప్రాపర్టీ, పైసా, పార్ట్‌నర్షిప్‌లని వ్యంగ్యంగా అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జేబులు నింపుకోవడమే గొడ్డలి పార్టీ P4 లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
శుక్రవారం రాజధాని అమరావతిలో కె.పట్టాభిరామ్ మాట్లాడుతూ.. 2019-24 మధ్య వైఎస్ జగన్ పీఏ కె.నాగేశ్వర్ రెడ్డి (కేఎన్ఆర్) భార్య ఖాతాలోకి రూ.20 కోట్లు వచ్చాయని ఆరోపించారు. ఓ సాధారణ పీఏ కేఎన్ఆర్ ఖాతాలోకి అన్ని కోట్లు ఎలా వచ్చాయి? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. అలాగే బెంగళూరుతో సహా పలు ప్రాంతాల్లో అతడికి ప్లాట్లు ఎలా వచ్చాయని సందేహం వ్యక్తం చేశారు. జగన్ పీఏకు మూడు రాష్ట్రాల్లో ఆస్తులున్నాయని పట్టాభిరామ్ తెలిపారు.
ఏపీలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పీఏ కేఎన్ఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. సిట్ కార్యాలయంలో గురువారం ఉదయం 11.00 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ రాత్రి వరకు కొనసాగింది. బుధవారం కూడా కేఎన్‌ఆర్‌ను సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా సిట్ అధికారులకు కేఎన్ఆర్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు సమాచారం.
2019కి ముందు కేఎన్ఆర్ సాధారణ జీవితాన్ని గడిపారు. అయితే 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం హయాంలో అతడు వందల కోట్ల రూపాయిలకు అధిపతిగా మారినట్లు సిట్ గుర్తించింది. ఈ సందర్భంగా అతడి ఆస్తుల వివరాలతోపాటు కాల్‌డేటా ఆధారంగా సిట్ అధికారులు విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest AP News And Telugu News