ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
ABN , Publish Date - Feb 11 , 2026 | 08:03 AM
గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, రాణిగంజ్, హయత్‌నగర్, హెచ్‌సీయూ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు నడుస్తున్నాయి.
ఇప్పటికే ఐదుచోట్ల ఏర్పాటు
డిసెంబర్ నాటికి 20 ప్రాంతాల్లో..
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ జోన్ పరిధిలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి తీసుకువచ్చేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కంటోన్మెంట్, మియాపూర్, రాణిగంజ్, హయత్‌నగర్, హెచ్‌సీయూ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు నడుస్తున్నాయి. త్వరలో కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, మిధాని, మహేశ్వరం(Kukatpally, Dilsukhnagar, Midhani, Maheshwaram) డిపోల్లో ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఓఆర్‌ఆర్ పరిధిలో ఎలక్ర్టిక్ బస్సులు మాత్రమే నడపాలని ప్రభుత్వం ప్రకటించడంతో గ్రేటర్ జోన్‌ను పూర్తిగా ఈవీ జోన్‌గా మార్చేదిశగా ఆర్టీసీ ముందుకెళ్తోంది. గ్రేటర్‌లో 370 ఈవీ బస్సులు నడుపుతుండగా మరో 170 బస్సులు ఈ నెలలో రోడ్లపైకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ నాటికి 20 డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది.
స్విచ్చింగ్ స్టేషన్ల ఏర్పాటుపై దక్షిణ డిస్కం దృష్టి
గ్రేటర్ జోన్‌లోని 20 ఆర్టీసీ డిపోల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు పలు ప్రాంతాల్లో స్విచ్చింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుందని దక్షిణ డిస్కం ఉన్నతాధికారులు ఆర్టీసీకి వివరించారు. ఈ నేపథ్యంలో 8 ప్రాంతాల్లో స్విచ్చింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థలాలు కేటాయించాలని ఆర్టీసీని కోరింది. దీంతో మూడు ప్రాంతాల్లో స్థలాలు కేటాయించింది. ఈ నెల చివరి నాటికి 20 డిపోల్లో ఈవీ స్టేషన్ల ఏర్పాటుకు అవసరమైన ఎస్టిమేషన్లు పూర్తిచేయాలని దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫారూఖీ మేడ్చల్, హైదరాబాద్ సౌత్, సెంట్రల్, సికింద్రాబాద్ సర్కిల్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎస్టిమేషన్ల ప్రక్రియ పూర్తయితే ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఆర్టీసీ టెండర్లు పిలవనుంది. ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతీ డిపోకు 33 కేవీ హెచ్‌టీ విద్యుత్ సప్లై, రెండు ఫీడర్ల నుంచి విద్యుత్ సరఫరా ఉండేలా లైన్లు వేయాలని ఆర్టీసీ అధికారులు దక్షిణ డిస్కం అధికారులకు దరఖాస్తు చేశారు.
ఈవీ స్టేషన్లు ఏర్పాటు చేసే డిపోలు
దిల్‌సుఖ్‌నగర్, మిధాని, బండ్లగూడ, మెహిదీపట్నం, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్-2, ఫలక్‌నుమా, మహేశ్వరం, జీడిమెట్ల, చెంగిచెర్ల, కూకట్‌పల్లి, మేడ్చల్, ఉప్పల్, రాణిగంజ్, కుషాయిగూడ.
ఈ వార్తలు కూడా చదవండి:
బంగారం పెరిగింది.. వెండి తగ్గింది.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు
Read Latest Telangana News and National News