Share News

ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు

ABN , Publish Date - Feb 11 , 2026 | 02:00 AM

పదహారేళ్ల వయసులో ఒక దృశ్యం... ఆమెను తీవ్రంగా కలచివేసింది. అదే డాక్టర్‌ కావాలనే బలమైన సంకల్పాన్ని కలిగించింది. ఆ తరువాత అనేకమంది జీవితాలకు...

ఎవరికీ పట్టనివారు ఆమెకు కావల్సినవారు

సంకల్పం

పదహారేళ్ల వయసులో ఒక దృశ్యం... ఆమెను తీవ్రంగా కలచివేసింది. అదే డాక్టర్‌ కావాలనే బలమైన సంకల్పాన్ని కలిగించింది. ఆ తరువాత అనేకమంది జీవితాలకు భరోసానిచ్చింది. ఎవరికీ పట్టనివారు తనకు కావల్సినవారంటూ సామాజిక బాధ్యతను భుజానికెత్తుకున్న 62 ఏళ్ల డాక్టర్‌ రేణుక రామకృష్ణన్‌ జర్నీ ఇది.

‘‘కొన్ని సంఘటనలు మనపై బలమైన ముద్ర వేస్తాయి. ఒక్కోసారి అవి మన జీవన పయనాన్ని కూడా మార్చేస్తుంటాయి. అలాంటిదే పదహారేళ్లప్పుడు నా జీవితంలోనూ చోటు చేసుకుంది. తమిళనాడులోని ఆలయాల నిలయమైన కుంభకోణం మాది. అక్కడ ఏటా భారీఎత్తున ఉత్సవం జరుగుతుంటుంది. వేలాదిమంది భక్తులు పాల్గొంటారు. భక్తుల మేళతాళాలు, ఊరేగింపులతో పట్టణం కిక్కిరిసిపోయింది. ఆ జనసందోహంలో ఓ వృద్ధుడు రోడ్డు పక్కన నిర్జీవంగా పడివున్నాడు. నా చూపు అటువైపు మళ్లింది. ఆరా తీస్తే కుష్టు వ్యాధితో మరణించాడని తెలిసింది. అతడిని ఎవరూ పట్టించుకోవడంలేదు. దగ్గరకు వెళ్లేందుకు కూడా సాహసించలేదు. అది నన్ను తీవ్రంగా కలచివేసింది. వేగంగా అటువైపు అడుగులు వేశాను. అతడి శరీరంపై నా దుపట్టా కప్పాను. ఎవరు ఎలా బతికినా మరణించినవారికి గౌరవంగా వీడ్కోలు పలకాలనేది నా అభిప్రాయం. అందుకే ఆ నిర్జీవ శరీరానికి అంతిమ సంస్కారాలు చేయాలని అనుకున్నాను. కానీ ఎవరూ సాయం రాలేదు. దాంతో నా భుజాలపై వేసుకుని దగ్గర్లోని శ్మశానానికి వెళ్లాను. అక్కడ కుష్టు రోగికి దహన సంస్కారాలు చేయడానికి నిరాకరించారు. ఎలాగో వారిని ఒప్పించాను. ఓ పెద్దాయన సహకారంతో కార్యక్రమం కానిచ్చాను.


అప్పుడే నిర్ణయించుకున్నా...

ఇంటికి వచ్చాక చాలా రోజులు ఆ సంఘటనే నా మనసులో మెదిలింది. నిద్ర పట్టేది కాదు. ఇలాంటివి పునరావృతం కాకూడదంటే ఏంచేయాలి? ఇవే ఆలోచనలు. ఒకరోజు నిర్ణయించుకున్నా... వైద్య విద్య చదవాలని. డాక్టర్‌ని అయితే అందరిలో అవగాహన పెంచవచ్చు. రోగులకు తగిన వైద్యం అందించవచ్చని. పట్టుదలగా చదివాను. ఎంబీబీఎ్‌సలో ర్యాంకు సాధించడమే కాదు, సంబంధిత సబ్జెక్టులో స్ఫెషలైజేషన్‌ కూడా చేశాను. ప్రస్తుతం సీనియర్‌ కన్సల్టెంట్‌ డెర్మటాలజి్‌స్టగా, లెప్రాలజి్‌స్టగా సేవలు అందిస్తున్నాను.

లివింగ్‌ మదర్‌ థెరిసా...

ఒక వైద్యురాలిగా, సామాజిక కార్యకర్తగా, ఇల్లాలిగా, తల్లిగా... ఇలా ఒక మహిళ బహుముఖ పాత్రలు పోషించడం అంత సులువు కాదు. కానీ అన్నిటినీ సమన్వయం చేసుకొంటూ ముందుకు వెళుతున్నా. అలాగే మోటివేషనల్‌ స్పీకర్‌గా కూడా విద్యా సంస్థలకు వెళుతుంటాను. పలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి వృద్ధ, అనాథ ఆశ్రమాలను సందర్శిస్తుంటాను. వారికి అవసరమైన వైద్య సాయం అందిస్తుంటాను. సమాజం పట్టించుకోని, దూరం పెట్టిన వారికి ఆర్థిక సాయం అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాను. ఇందుకు గానూ నాకు రెండు వందలకు పైగా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు లభించాయి. నాపైన కొన్ని డాక్యుమెంట్లు కూడా తీశారు. ‘లివింగ్‌ మదర్‌ థెరిసా’ అంటూ నన్ను కొందరు కీర్తిస్తుంటారు. ఆ పిలుపు నాకు ఎంతో ప్రేరణనిస్తుంది.

అన్నిటికన్నా సంతృప్తి కలిగించే అంశం ఏంటంటే... నా ప్రయత్నంవల్ల తమిళనాడులో కుష్టు వ్యాధి కేసులు గణనీయంగా తగ్గడం. కానీ ఈ వ్యాధి లేని సమాజాన్ని చూసినప్పుడే నాకు నిజమైన సంబరం.’’


2-Navya.jpg

ఆయన చూపిన మార్గం...

నాడు మరణించి కూడా ఆ వృద్ధుడు నాకు సందేశం ఇచ్చినట్టు అనిపించింది... సేవా మార్గంలో పయనించమని. అందుకే వైద్య వృత్తిని ఎంచుకున్నాను. కుష్టుతో పాటు హెచ్‌ఐవీ బాధితులకు కూడా ఉచిత వైద్యం అందిస్తున్నాను. వారి పట్ల సమాజం దృష్టి కోణాన్ని మార్చే ప్రయత్నం నాది. ఈ కార్యక్రమాలన్నిటి కోసం ‘మంగళం చారిటబుల్‌ ట్రస్ట్‌’ నెలకొల్పాను. దానికి ఎండీగా, ‘రోటరీ క్లబ్‌’ సభ్యురాలిగా నిత్యం ప్రజలతో మమేకం అవుతున్నాను. ‘చికిత్స కంటే నివారణ మంచిద’ని నమ్ముతాను. ఈ సందేశాన్ని నలుమూలలకూ తీసుకువెళ్లడానికి ఇప్పటివరకు వందల సంఖ్యలో ఉచిత హెల్త్‌ క్యాంపులు నిర్వహించాను. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై అవగాహన సదస్సులు, రక్తదాన, మెడికల్‌ స్ర్కీనింగ్‌ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాను.

ఈ వార్తలు కూడా చదవండి..

పాల వ్యాన్‌లో రేషన్ బియ్యం తరలింపు.. కేసు నమోదు

మున్సిపల్ ఎన్నికలు... సెలవు ప్రకటించిన సర్కార్..

For More AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 02:00 AM