డాక్టర్ నమ్రత ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 07:37 PM
సృష్టి సరోగసీ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
హైదరాబాద్, మార్చి 10: సృష్టి సరోగసీ అక్రమాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దాదాపు రూ. 50 కోట్ల ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ అధికారులు మంగళవారం ప్రకటించారు. సృష్టి కేసులో సీసీఎస్ పోలీసుల విచారణ తర్వాత.. ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టింది. సృష్టి కేసులో డాక్టర్ నమ్రతను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం తమ కస్టడీకి నమ్రతను ఇవ్వాలంటూ సీసీఎస్ పోలీసులను ఈడీ అధికారులు కోరారు. ఆ క్రమంలో రెండు రోజుల పాటు డాక్టర్ నమ్రతను విచారించిన ఈడీ అధికారులు.. పలు కీలక విషయాలను రాబట్టారు. దీంతో రూ. 50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
2014 నుంచి సరోగసీ అక్రమాలకు ఆమె పాల్పడినట్లు దర్యాప్తులో గుర్తించారు. అలాగే నమ్రతపై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్.. దర్యాప్తు నివేదిక ఆధారంగా చేసుకుని ఈడీ దూకుడు పెంచింది. అంతేకాకుండా.. ఈ కేసులో మనీలాండరింగ్ కూడా ఉందని ఈడీ భావిస్తోంది. ముఖ్యంగా పిల్లలు లేని తల్లిదండ్రులకు సరోగసీ పేరు చెప్పి భారీగా రూ. లక్షల్లో నగదు వసూలు చేసి మోసం చేసినట్లు ఈ దర్యాప్తులో గుర్తించారు.
ఇక గిరిజన తండాల్లోని పిల్లలను కొనుగోలు చేసి.. విక్రయించినట్లు తెలుస్తోంది. సరోగసీ ద్వారా కోట్లాది రూపాయిలను డాక్టర్ నమ్రతా సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. ఈ నగదునంతా విదేశాలకు తరలించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగానే రూ. 50 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేయాలని ఈడీ అధికారులు నిర్ణయించారు.
దీంతో డాక్టర్ నమ్రతకు చెందిన మొత్తం 50 స్థిరాస్తులను ఈడీ అధికారులు సీజ్ చేశారు. భూములు, ఫ్లాట్లు, ఆసుపత్రి సహా పలు ఆస్తులను అటాచ్ చేశారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.50 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేద గర్భిణీలను నగదుతో ప్రలోభపెట్టి పిల్లలను కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. ఆడపిల్లకు రూ. 3.5 లక్షలు, మగపిల్లవానికి రూ 4.5 లక్షలు చెల్లించారు. జనన రికార్డుల్లో తల్లిదండ్రుల పేర్లు సైతం ఫోర్జరీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
అనకాపల్లిలో మైనర్ మృతి.. వీడిన మిస్టరీ
మూసీ పేరుతో మూటల వేటకు వ్యతిరేకం: కేటీఆర్
Read Latest TG News And Telugu News