అనకాపల్లిలో మైనర్ మృతి.. వీడిన మిస్టరీ
ABN , Publish Date - Mar 10 , 2026 | 06:17 PM
అనకాపల్లి మండలం ఏటికొప్పాక సమీపంలో వరాహ నదీ వద్ద బాలుడు ఆడారి వెంకట్ కౌశిక్ మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మైనర్ బాలుడి చేతిలోని నాటు తుపాకీ పేలడంతోనే కౌశిక్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
అనకాపల్లి, మార్చి 10: అనకాపల్లి మండలం ఏటికొప్పాక సమీపంలో వరాహ నదీ వద్ద బాలుడు ఆడారి వెంకట్ కౌశిక్ మృతి కేసును పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. మైనర్ బాలుడి చేతిలోని నాటు తుపాకీ పేలడంతోనే కౌశిక్ మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నాటు తుపాకీ పేలిన ఘటనలో కౌశిక్ మృతి చెందగా.. మరో ఇద్దరు స్వల్పంగా గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. విషయం వెల్లడైందని పోలీసులు వివరించారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. తన ఇంట్లో తుపాకులు ఉన్నాయని సహచర స్నేహితులను తొమ్మిదేళ్ల బాలుడు తెలిపాడు. ఆ తుపాకీలను తాము చూస్తామని బాలుడితో వారు చెప్పారు. తన తండ్రి కసింకోట సూరిబాబు లేని సమయంలో తోటి స్నేహితులను తన ఇంటికి మైనర్ తీసుకెళ్లాడు. ఆయా తుపాకులను చూపించే క్రమంలో.. ఒకటి మందుగుండు బాగా దిట్టించి ఉండడంతో ఒక్కసారిగా పేలింది. ఈ నాటు తుపాకీ పేలడంతో ఎదురుగా ఉన్న కౌశిక్ అక్కడికక్కడే మరణించారు.
ఇక ఈ తుపాకీ పేల్చిన మైనర్‌తోపాటు మరొకరికి స్వల్పంగా గాయాలయ్యాయి. ఈ విషయం తండ్రి సూరిబాబుకి తెలిసింది. దాంతో కౌశిక్ మృతదేహాన్ని కొండ ప్రాంతంలో పడేసి అక్కడి నుంచి తన కొడుకుతోపాటు అతడు పరారయ్యాడు. తన వద్ద ఉన్న రెండు నాటు తుపాకులను పూరిపాకలో సూరిబాబు దాచాడు. పోలీసులకు ఈ విషయం తెలిసిపోతుందని భావించిన సూరిబాబు వెంటనే అప్రమత్తమయ్యాడు. ఆ రెండు తుపాకులను మరో ప్రాంతంలో దాచాడు.
అయితే మందు గుండు సరఫరా చేసిన కసింకోట అప్పలరాజుతోపాటు పేలుడుకు కారణమైన బాలుడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అక్రమంగా నాటు తుపాకులు కలిగి ఉండడమే కాక.. ఈ తుపాకీ పేలటానికి సిద్ధంగా ఉంచిన కసింకోట సూరిబాబును పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అలాగే ఈ రెండు నాటు తుపాకులతో పాటు గన్ పౌడర్, బుల్లెట్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును కేవలం 24 గంటల్లో ఛేదించినందుకు సీఐ ధనుంజయ్ రావు, ఎస్సై ఉపేంద్రలను అనకాపల్లి డీఎస్పీ మోహనరావు అభినందించారు.
ఇవి కూడా చదవండి..
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు..
మూసీ పేరుతో మూటల వేటకు వ్యతిరేకం: కేటీఆర్
Read Latest AP News And Telugu News