బీజేపీ ‘బతుకమ్మ’కు బ్రహ్మరథం
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:42 AM
దుబాయ్‌లో శనివారం సాయంత్రం బీజేపీ అనుకూల ప్రవాసీ సంఘం నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంచనాకు మించి ప్రజలు రావడంతో పరిస్థితి అదుపు తప్పి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది.
దుబాయ్‌లో అంచనాకు మించిన జనాలు
నిర్వహణలో సత్తాచాటిన కమలనాథులు
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)
దుబాయ్‌లో శనివారం సాయంత్రం బీజేపీ అనుకూల ప్రవాసీ సంఘం నిర్వహించిన బతుకమ్మ సంబరాలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంచనాకు మించి ప్రజలు రావడంతో పరిస్థితి అదుపు తప్పి పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. ఎంపిక చేసిన కొద్దిమంది కుటుంబాలతో బతుకమ్మ సంబరాలను స్థానిక పాఠశాల ఆడిటోరియంలో నిర్వహించడానికి ఐపీఎఫ్ తెలంగాణ చాప్టర్ అనే ప్రవాసీ సంఘం ఏర్పాట్లు చేసుకోగా.. దీనికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వస్తున్నట్లుగా తెలుసుకున్న సమీప ప్రాంతంలోని నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ప్రవాసీయులు పెద్ద సంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
కార్మికులు పెద్ద సంఖ్యలో నివసించే అల్‌ఖోజ్ ప్రాంతం నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. అనుకోకుండా పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజలను అదుపు చేయలేక పాఠశాల భద్రతా సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తెలంగాణ పండుగ, సాంస్కృతిక వారసత్వాన్ని విదేశాల్లోనూ పరీక్షించేందుకు కృషి చేస్తున్న ప్రవాసీయులను అర్వింద్ అభినందించారు. తన దుబాయ్ పర్యటన సందర్భంగా ప్రతిసారీ ధరించినట్లుగా జీన్స్, టీ షర్టుతో వచ్చిన అర్వింద్ యువకులతో కలిసి ఉత్సాహంగా మెలిసి తిరిగి, వారితో ఫోటోలు దిగారు. కార్యక్రమంలో బీజేపీ నేత, వరంగల్‌కు చెందిన మాజీ మంత్రి దివంగత దాస్యం ప్రణయ్ భాస్కర్ కుమారుడు వినయ్ కూడా పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గోదావరి-కావేరీ లింకు పేరుతో కుట్ర:హరీశ్
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International