కోర్సు పూర్తి చేస్తేనే డ్రైవింగ్ లైసెన్స్!
ABN , Publish Date - Sep 12 , 2026 | 05:08 AM
రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో త్వరలో నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రహదారి భద్రతపై రూపొందించిన రెండున్నర గంటల నిడివిగల వీడియోలను వీక్షించటంతోపాటు వాటిపై నిర్వహించే పరీక్షలో దరఖాస్తుదారుడు పాస్ కావటాన్ని తప్పనిసరి చేయనున్నారు.
క్యూర్ పరిధిలో త్వరలో కొత్త నిబంధనలు
కూకట్‌పల్లిలో పైలట్ ప్రాజెక్టు విజయవంతం
త్వరలో రాష్ట్రవ్యాప్త అమలు.. మొదట క్యూర్‌లో..
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీలో త్వరలో నూతన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. రహదారి భద్రతపై రూపొందించిన రెండున్నర గంటల నిడివిగల వీడియోలను వీక్షించటంతోపాటు వాటిపై నిర్వహించే పరీక్షలో దరఖాస్తుదారుడు పాస్ కావటాన్ని తప్పనిసరి చేయనున్నారు. ఈ నిబంధనలతో కూకట్‌పల్లి ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో త్వరలో రాష్ట్రమంతటా అమలుచేయాలని అధికారులు భావిస్తున్నారు
. ఇందులో భాగంగా మొదట కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో అమలు చేయాలని నిర్ణయించారు. మరో 30- 45 రోజుల్లో ఈ విధానం క్యూర్ పరిధిలో అమలు చేస్తామని ఒక అధికారి తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటున్న చాలామందికి ప్రస్తుతం రహదారి భద్రతా నిబంధనలపై సరైన అవగాహన ఉండడం లేదు. దీంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ర్టేలియా, యూకే, అమెరికా వంటి దేశాల్లో ఉన్న ఉత్తమ విధానాలను పరిశీలించి నిబంధనలపై వీడియోలను రూపొందించారు. లెర్నర్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (ఎల్‌ఎల్‌ఆర్) చేసుకున్న అనంతరం ఈ వీడియోలను ఆన్‌లైన్‌లో వీక్షించి, పరీక్ష రాయటమే ఈ కోర్సు.
ఏంటీ నిబంధనలు..?
ఎల్‌ఎల్‌ఆర్ తీసుకున్న వ్యక్తి 6 మాడ్యూల్స్‌గా ఉండే వీడియోలను వీక్షించాలి. ఒక్కో మాడ్యూల్‌లో 25 నిమిషాల నిడివిగల వీడియోలు ఉంటాయి. 64 రోడ్డు భద్రతా నిబంధనలు, ప్రాక్టికల్ డ్రైవింగ్ పాఠాలు తదితర అంశాలు ఈ వీడియోల్లో ఉంటాయి. రెండున్నర గంటల కోర్సు పూర్తిచేసిన తరువాతే ఎల్‌ఎల్‌ఆర్ ఉన్న వ్యక్తికి రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం స్లాట్ బుక్ చేసుకొనే అవకాశం ఇస్తారు. ఈ వీడియోలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఆన్‌లైన్‌లో ఉంటాయి. ఎల్‌ఎల్‌ఆర్ తీసుకున్న అనంతరం అభ్యర్థులు ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నైషన్) చేసుకోవాలి. కోర్సు ముగిసే వరకు అభ్యర్థి ముఖం కెమెరాకు స్పష్టంగా కనిపించాలి. కోర్సును ఒకేసారి కాకుండా మధ్యలో ఆపి (పాజ్), సమయం ఉన్నప్పుడు తిరిగి చూసే అవకాశం ఉంటుంది. 25 నిమిషాల పాటు ఉండే ఒక్కో మాడ్యూల్ పూర్తయిన అనంతరం దానికి 5 ప్రశ్నల క్విజ్ ఉంటుంది. వీటికి తప్పనిసరిగా సమాధానం ఇవ్వాలి. ఆరు మాడ్యూల్స్ పూర్తయిన తరువాత తుది పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అయితేనే రెగ్యులర్ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కోసం బుక్ చేసుకోవడానికి అర్హులు. పైలట్ ప్రాజెక్టు కింద కూకట్‌పల్లిలో ఇప్పటివరకు 3,400 మందికిపైగా ఎల్‌ఎల్‌ఆర్ తీసుకోగా.. వీరిలో 2,800 మంది కోర్సు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
క్యూర్.. పాలనపై కేర్!
10,450 ఎంబీబీఎస్ సీట్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News