Share News

ఫేస్‌బుక్ పరిచయం.. ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కు రూ.14.61 కోట్ల టోకరా..

ABN , Publish Date - Sep 27 , 2026 | 05:07 PM

తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ చరిత్రలో రికార్డు స్థాయి భారీ మోసం వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మిన ఓ 44 ఏళ్ల డాక్టర్‌ ఏకంగా రూ.14.61 కోట్లు పోగొట్టుకున్నాడు.

ఫేస్‌బుక్ పరిచయం.. ట్రేడింగ్ పేరుతో డాక్టర్‌కు రూ.14.61 కోట్ల టోకరా..
Cyber Crime in Hyderabad

హైదరాబాద్: తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ చరిత్రలో రికార్డు స్థాయి భారీ మోసం వెలుగు చూసింది. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళ మాటలు నమ్మిన ఓ 44 ఏళ్ల డాక్టర్‌ ఏకంగా రూ.14.61 కోట్లు పోగొట్టుకున్నాడు. అధిక లాభాల ఆశతో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ మాయలో పడి విడతల వారీగా నగదు చెల్లించాడు. చివరికి మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.


హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు చెందిన డాక్టర్‌కు కొన్నాళ్ల కిందట ఫేస్‌బుక్‌ ద్వారా ఓ మహిళ పరిచయమైంది. కొంతకాలం తర్వాత ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని వైద్యుడిని ఆమె నమ్మించింది. ఓ నకిలీ ట్రేడింగ్‌ వెబ్‌సైట్‌ లింకులను అతనికి పంపింది. అనంతరం ఆ వెబ్‌సైట్‌ ద్వారా పెట్టుబడులు పెడితే మంచి ఆదాయం వస్తుందని సైబర్‌ నేరగాళ్లు నమ్మించారు. తొలుత డాక్టర్‌తో చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టించారు. అనంతరం పెట్టుబడులపై లాభాలు వచ్చినట్లు వెబ్‌సైట్‌లో చూపిస్తూ మరింత మొత్తాన్ని పెట్టేలా ప్రోత్సహించారు. ట్రేడింగ్‌లో భారీ లాభాలు వస్తున్నాయనే నమ్మకంతో డాక్టర్‌ విడతల వారీగా పెద్ద మొత్తంలో డబ్బును డిపాజిట్‌ చేశారు.


ఈ విధంగా డాక్టర్ నుంచి సైబర్‌ కేటుగాళ్లు మొత్తం రూ.14.61 కోట్లు పెట్టుబడిగా పెట్టించారు. కొంతకాలం తర్వాత లాభాలను తీసుకునేందుకు వైద్యుడు ప్రయత్నించగా సమస్యలు ఎదురయ్యాయి. దీంతో మోసపోయినట్లు గుర్తించిన డాక్టర్‌.. వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో ఫేస్‌బుక్‌ పరిచయాలు, ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో నమ్మించడం, నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా పెట్టుబడులు పెట్టించడం వంటి అంశాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రూ.14.61 కోట్లు భారీ మొత్తం కావడంతో తెలంగాణలోని సైబర్‌ మోసాల్లో ఇది అతి పెద్ద ఘటనగా నిలిచినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఢిల్లీలో ఈ నెల 29న దళిత, ఆదివాసీ ఆత్మాభిమాన సమావేశం: ఎంపీ మల్లు రవి

20 ఏళ్లయినా బీఆర్ఎస్ అధికారంలోకి రాదు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

Updated Date - Sep 27 , 2026 | 05:19 PM