ఢిల్లీలో ఈ నెల 29న దళిత, ఆదివాసీ ఆత్మాభిమాన సమావేశం: ఎంపీ మల్లు రవి
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:01 PM
దేశ రాజధానిలో ఈ నెల 29న దళిత, ఆదివాసీ ఆత్మాభిమాన సమావేశం నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ నెల 29న దళిత, ఆదివాసీ ఆత్మాభిమాన సమావేశం నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి తెలిపారు. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ ఎంపీల ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ భేటీలో దళిత, ఆదివాసీల సమస్యలు, హక్కులు, సామాజిక న్యాయం వంటి అంశాలపై చర్చించనున్నట్లు ఎంపీ పేర్కొన్నారు.
ఈ సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు మల్లు రవి తెలిపారు. అలాగే కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు హాజరుకానున్నారని వెల్లడించారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానకర ఘటనపైనా చర్చించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ‘ఖర్గేను అవమానించడం అంటే యావత్ దళిత వర్గాన్ని అవమానించడమే’ అని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా దళితులు, ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, సామాజిక వివక్ష, వారి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ, సమానత్వం కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు ఎంపీ రవి తెలిపారు. అలాగే ఆయా అంశాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణపైనా నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సమగ్రంగా, సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులను కోరనున్నట్లు ఎంపీ మల్లు రవి వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
రాహుల్ ఆరోపణలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
భూ సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: మంత్రి పొంగులేటి