రూ. లక్ష కోట్లు ముంచిన కేసీఆర్‌ను కాపాడుతున్న సీఎం రేవంత్: నిజామాబాద్ ఎంపీ
ABN , Publish Date - Jul 23 , 2026 | 05:41 PM
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఈ 30 నెలలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని ఎంపీ ధర్మపురి అర్వింద్ సందేహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు మొత్తం సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ సీఎంను ఆయన సూటిగా ప్రశ్నించారు.
న్యూఢిల్లీ, జులై 23: తెలంగాణలో సాగు, తాగు, థర్మల్ పవర్ ప్లాంట్లకు నీరు అందడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం న్యూఢిల్లీలో బీజేపీ ఎంపీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల సంపద లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఏం చేద్దామనుకుంటున్నారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి చేసినవారు, ప్రస్తుతం కాపాడే వ్యక్తి బాగానే ఉన్నారని వ్యంగ్యంగా అన్నారు. కానీ మధ్యలో రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
2023లోనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చిందని వివరించారు. 2019లోనే మూడు బ్యారేజీల వద్ద పనులు ప్రారంభించిన వెంటనే పగుళ్లు వచ్చాయని పేర్కొందని తెలిపారు. 2023, అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ వద్ద పిల్లర్లు ఇసుక కారణంగా కుంగిపోయాయని ఎన్డీఎస్ఏ వివరించిందని అన్నారు. డీపీఆర్ అనుమతులు లేకుండానే కాళేశ్వరం నిర్మించారని విమర్శించారు. ఈ బ్యారేజీలను ముందస్తు ప్రణాళిక ప్రకారం కాకుండా వేరే చోట నిర్మించారని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు కమీషన్లు ఇవ్వాలనే ఆతృతతో ఆగం ఆగంగా నిర్మించారని తెలిపారు.
డిజైన్లు ఎందుకు మార్చారు.. అందుకు సంబంధించిన ఫైళ్లు అడిగితే జవాబు ఇవ్వలేదని బీజేపీ ఎంపీ మండిపడ్డారు. అన్నారం, సుందిళ్ల కూడా మేడిగడ్డ మాదిరిగానే ఉన్నాయని అన్నారు. మూడు బ్యారేజీలను పూర్తిగా పరిశీలించి, అవసరమైన చోట తిరిగి రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏ సూచించిందని వివరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఈ 30 నెలలు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేశారని ఎంపీ ధర్మపురి అర్వింద్ సందేహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సీబీఐ విచారణకు ఎందుకు ఇవ్వలేదని తెలంగాణ సీఎంను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. రూ.30 వేల కోట్ల విలువైన పనులు జరిగిన తర్వాత ఎన్డీఎస్ఏ దగ్గరకు వచ్చారని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో రూ. లక్ష కోట్లు నీళ్లలో పోయాయని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంట్‌లో చెప్పారని గుర్తు చేశారు.
రూ. లక్ష కోట్లు ముంచిన కేసీఆర్‌ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, కేటీఆర్ దోచుకున్న పైసలను ప్రస్తుతం వారి నుంచి సీఎం రేవంత్ దోచుకుంటున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబం వద్ద సీఎం రేవంత్ రెడ్డి ఎంత తీసుకున్నాడు.. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఎంత ఇచ్చాడు అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టులో ఎమ్మెల్సీ అనంత బాబుకు మరో ఎదురు దెబ్బ
యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి
For More TG News And Telugu News