కోర్టులో ఎమ్మెల్సీ అనంత బాబుకు మరో ఎదురు దెబ్బ
ABN , Publish Date - Jul 23 , 2026 | 07:01 PM
డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏసీబీ కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. జైలులో తనకు బీ కేటగిరి వసతులు కల్పించాలన్న అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.
రాజమహేంద్రవరం, జులై 23: డ్రైవర్ వీధి సుబ్రమణ్యం హత్య కేసులో నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఏసీబీ కోర్టులో మరో ఎదురు దెబ్బ తగిలింది. జైలులో తనకు బీ కేటగిరి వసతులు కల్పించాలంటూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు గురువారం కొట్టివేసింది. ప్రత్యేక వసతుల కల్పనకు అనంత బాబుకు అర్హత లేదని పేర్కొంటూ ఆ పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. నిందితుడిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు దృష్టికి ప్రత్యేక పీపీ ముప్పాళ్ల సుబ్బారావు తీసుకెళ్లారు. అలాగే నిందితుడి ఆరోగ్య పరిస్ధితి బాగుందని, అతడికి ఏ సమస్య లేదని వైద్యులు నివేదిక ఇచ్చారని కోర్టుకు వివరించారు.
ఇక నిందితుడు అనంతబాబు చెప్పినట్లు వెన్నుపూస, గ్యాస్ట్రిక్ సమస్యలేవి అతడికి లేవని ఆ నివేదికలో స్పష్టమయ్యాయని కోర్టుకు పీపీ తెలిపారు. ఈ నేపథ్యంలో అనంతబాబు పిటిషన్‌ను కొట్టివేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పీపీ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. దీంతో అనంతబాబు పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. కనీసం ఇంటి నుంచి ఓ పూట సాధారణ భోజనం, నిద్ర పోవడానికి పరుపు ఇవ్వాలని కోర్టును అనంతబాబు కోరారు. అందుకు కోర్టు అనుమతి మంజూరు చేసింది.
మరో వైపు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో సాక్షుల వాంగ్మూలం నమోదుపై అనంతబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. సాక్ష్యం చెప్పేందుకు ఏసీబీ కోర్టుకు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌తోపాటు అతని కుమార్తె వచ్చారు. దీంతో ఏసీబీ కోర్టుకు సాక్ష్యులను విచారించే చట్టబద్దత లేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనంతబాబు పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులోనే సాక్షుల వాంగ్మూలాన్నినమోదు చేయాల్సి ఉందని ఆ పిటిషన్‌లో అనంతబాబు స్పష్టం చేశారు. దీంతో సాక్షుల వాంగ్మూలాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి నమోదు చేయలేదు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయడం సహా వాదనల కోసం ఈ కేసు విచారణను జులై 27వ తేదీకి వాయిదా వేశారు. అనంతబాబుకు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని ఆ రోజు వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
యూపీఏ హయాంలో పేపర్లు లీక్.. కాంగ్రెస్ నేతలు ఎందుకు రాజీనామా చేయలేదు: కిషన్ రెడ్డి
ఉద్యమకారులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం: కేకే
For More AP News And Telugu News