దసరాకు పోయొస్తం..!!
ABN , Publish Date - Oct 19 , 2026 | 05:25 AM
రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చిన వారిలో చాలా మంది దసరా పండగకి సొంతూళ్లకు బయలుదేరారు.
విజయదశమికి సొంతూళ్లకు బయలుదేరిన హైదరాబాదీలు
ప్రయాణికులతో బస్టాండ్‌లు, వాహనాలతో హైవేలు కిటకిట
యాదాద్రి/ చౌటుప్పల్/ చౌటుప్పల్ రూరల్/ బీబీనగర్/ హైదరాబాద్ సిటీ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చిన వారిలో చాలా మంది దసరా పండగకి సొంతూళ్లకు బయలుదేరారు. పాఠశాలలకు సెలవు దినాలు మొదలైనప్పటి నుంచి పెరిగిన పండగ ప్రయాణాలు.. శనివారం నుంచి మరింత ఊపందుకున్నాయి. రాష్ట్రంలోని స్వగ్రామాలకు వెళ్లేవారితోపాటు ఏపీలోని సొంతూళ్లకు వెళ్లేవారితో బస్టాండ్‌లు, కార్లు, బస్సులతో జాతీయ రహదారులు ఆదివారం కిటకిటలాడాయి. ముఖ్యంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఆదివారం చాలా రద్దీగా మారింది. సాధారణ రోజుల్లో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ నుంచి 38 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
అయితే ఆదివారం ఈ సంఖ్య 51 వేలు దాటింది. దీంతో చౌటుప్పల్‌లోనూ వాహన రద్దీ కనిపించింది. చౌటుప్పల్ మీదుగా విజయవాడ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కార్ల దారి మళ్లింపు కొనసాగుతోంది. మరోపక్క, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని హైదరాబాద్- భూపాలపల్లి 163వ జాతీయ రహదారి కూడా ఆదివారం కిటకిటలాడింది. వరంగల్ హైవేపై వాహనాల రద్దీ పెరగ్గా... బీబీనగర్ మండలం గూడూరు టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరి కనిపించాయి. కాగా, పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు ఆదివారం కిక్కిరిశాయి. రద్దీకి తగినట్లు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి బస్సుల కోసం ఎదురు చూశారు.
హైదరాబాద్ నుంచి వెయ్యికి పైగా సిటీ బస్సులను జిల్లాలకు పంపించారు. ఆదివారం రాత్రి 8 గంటల వరకు రెగ్యులర్ సర్వీసులతో పాటు వెయ్యికి పైగా ప్రత్యేక సర్వీసులను ఏపీ, తెలంగాణ జిల్లాలకు నడిపినట్లు ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే, గ్రామీణ ప్రాంతాల సర్వీసులను ప్రత్యేక బస్సులుగా నగరాలు, ప్రధాన మార్గాలకే పరిమితం చేయడంతో గ్రామీణ ప్రాంతాలకు బస్సు సర్వీసులు లేకుండా పోతున్నాయి. భువనగిరి, యాదగిరిగుట్ట, చౌటుప్పల్ వంటి పట్టణాల బస్టాండ్‌ల నుంచి పల్లెలకు వెళ్లే బస్సులు లేక ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
ఈ వార్తలు కూడా చదవండి
మూడోవంతు విద్యుత్ జెన్‌కో నుంచే...
అవసరమైతే కోమటిరెడ్డి కోసం తల నరుక్కుంటా..
క్యూనెట్ కేసు కీలక నిందితుడు డిగ్ విజయ్‌సింగ్ అరెస్టు
Read Latest AP News And Telangana News And International