ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN , Publish Date - Sep 24 , 2026 | 06:12 PM
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు అని అభివర్ణించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నానని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ఉల్లంఘనపై సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు అని అభివర్ణించారు. ఇది అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకు గుణపాఠమని అన్నారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంలో సుప్రీంకోర్టు గురువారం స్పందించింది.
ఈ నేపథ్యంలో దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా మంత్రులను చేసిందని.. నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకుని కాంగ్రెస్ తమ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయించిందని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న ఖైరతాబాద్ ఉప ఎన్నికలో.. రెండు ఫిరాయింపు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో బీజేపీ ఘనవిజయం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.
దానం నాగేందర్ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అవుతుందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారని తెలిపారు. దీనిపై తెలంగాణ హైకోర్టును బీజేపీ ఆశ్రయిస్తే.. 2024 ఏప్రిల్ 23 నుంచి ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించిందని.. దీన్ని సుప్రీంకోర్టు తాజాగా సమర్థించిందని అన్నారు.
ఈ తీర్పు ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదని.. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చట్టవ్యతిరేకంగా అనుసరిస్తున్న పార్టీ ఫిరాయింపుల రాజకీయాలకు ఇది ఓ గుణపాఠమని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకోవడం.. వారికి మంత్రిపదవులు ఇవ్వడం తెలంగాణ రాజకీయాల్లో ఈ రెండు పార్టీలు ఓ దురదృష్టకరమైన సంస్కృతిగా మార్చారని మండిపడ్డారు. ప్రజా తీర్పును కాలరాయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో పోటీ పడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను విమర్శించడం అధికారంలోకి వచ్చాక అదే ఫిరాయింపులను ప్రోత్సహించడం ఈ రెండు పార్టీల రాజకీయ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతుందని చెప్పారు. ప్రజా తీర్పును తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా కాల రాస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అవకాశవాద రాజకీయాలకు సుప్రీంకోర్టు తీర్పు స్పష్టమైన హెచ్చరిక అని తెలిపారు.
దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవి అనర్హత కారణంగా ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ ప్రజలు.. అవకాశవాద, స్వార్థ, ఫిరాయింపు రాజకీయాలకు వ్యతిరేకంగా తమ ప్రతినిధిని ఎన్నుకునే అవకాశం రానుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలేనని వివరించారు. ఈ రెండు పార్టీల కుళ్లు రాజకీయాలకు తగిన బుద్ధి చెప్పి.. ఖైరతాబాద్ అసెంబ్లీ ప్రజలు.. వచ్చే ఉప ఎన్నికలో బీజేపీకి పట్టంగట్టడం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
క్షుద్ర పూజలు చేశానంటూ తప్పుడు ప్రచారం: కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్
సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి చెంపపెట్టు: హరీశ్ రావు
Read Latest TG News And Telugu News