Share News

రూ.24.18 లక్షల విలువైన ఆల్ఫాజోలం పట్టివేత.. నలుగురి అరెస్ట్

ABN , Publish Date - Sep 14 , 2026 | 03:34 PM

గండిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో భారీగా ఆల్ఫాజోలం పట్టుబడింది. సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి మొత్తం 1.769 కిలోల ఆల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు.

రూ.24.18 లక్షల విలువైన ఆల్ఫాజోలం పట్టివేత.. నలుగురి అరెస్ట్
Cyberabad Enforcement

హైదరాబాద్, సెప్టెంబర్ 14: గండిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో భారీగా ఆల్ఫాజోలం పట్టుబడింది. సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి మొత్తం 1.769 కిలోల ఆల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.24.18 లక్షలు ఉంటుందని అంచనా. అలాగే ఆల్ఫాజోలాన్ని విక్రయిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మెదక్, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు ఆల్ఫాజోలాన్ని విక్రయిస్తున్నారనే సమాచారంతో సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీం.. మంచిరేవుల, గండిపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.


మొదట వ్యాగనార్ కారులో తరలిస్తున్న 751 గ్రాముల ఆల్ఫాజోలంను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో కేసులో ఇదే ప్రాంతంలో బైక్‌పై వెళ్తున్న మరో ఇద్దరి వద్ద 1.18 కిలోల ఆల్ఫాజోలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మొత్తం 1.769 కేజీల ఆల్ఫాజోలం పట్టుబడింది. ఈ కేసులో మెదక్, మహబూబ్‌నగర్‌కు చెందిన లింగరాజు గౌడ్, టి.ఆంజనేయులు, ఆర్. రమేష్, కాటమయ్యలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులకు ఆల్ఫాజోలం సరఫరా చేసిన మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేసినట్లు సైబరాబాద్ అసిస్టెంట్ కమిషనర్ జి. శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆల్ఫాజోలం, వాహనాలు, నిందితులను గండిపేట ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు వెల్లడించారు. కల్లు తయారీలో వినియోగించే ఆల్ఫాజోలాన్ని అక్రమంగా తీసుకువచ్చినా, దానితో కల్లు తయారు చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.


ఈ దాడిలో సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ సూర కృష్ణ, ఎస్సై రమేష్, ట్రైనీ ఎస్సైలు రమణ, రమేష్, గిరి, హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, కానిస్టేబుళ్లు పెంటారెడ్డి, సాయికుమార్, శ్యామ్, శిల్ప, జయలక్ష్మి, శోభ తదితరులు పాల్గొన్నారు. పెద్ద మొత్తంలో ఆల్ఫాజోలాన్ని పట్టుకున్న సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంను కమిషనర్ సి.హరికిరణ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అవినాష్ మహంతి, జాయింట్ కమిషనర్ అంజన్ రావు, సైబరాబాద్ డిప్యూటీ కమిషనర్ జై హరి కిషన్ అభినందించారు.


ఇవి కూడా చదవండి...

బీఆర్ఎస్‌కు దమ్ముంటే తలసానికి ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలి: మహేశ్ గౌడ్

ఆరు నెలల క్రితం ప్రేమ వివాహం.. అంతలోనే దారుణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 03:43 PM