సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్: డీజీపీ సీవీ ఆనంద్
ABN , Publish Date - Jul 16 , 2026 | 07:36 PM
సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీటిని ఇప్పుడే నియంత్రించక పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సైబర్ మోసాలతో కుటుంబాలు జీవితకాల పొదుపు కోల్పోతున్నారని పేర్కొన్నారు.
హైదరాబాద్, జులై 16: సైబర్ నేరాలే భవిష్యత్తులో అతిపెద్ద సవాల్ అని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీటిని ఇప్పుడే నియంత్రించక పోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. సైబర్ మోసాలతో కుటుంబాలు జీవితకాల పొదుపు కోల్పోతున్నారని పేర్కొన్నారు. గురువారం డీజీపీ కార్యాలయంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పనితీరుపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. AI ఆధారిత సైబర్ కాల్ సెంటర్ పని తీరుపై ప్రశంసలు కురిపించారు. సైబర్ ల్యాబ్, ఎస్‌ఒసి (SOC), డిజిటల్ ఫోరెన్సిక్, సోషల్ మీడియా యూనిట్లను ఆయన పరిశీలించారు. 2025లో సైబర్ మోసాల వల్ల రూ.1,524 కోట్ల ఆర్థిక నష్టం జరిగిందని వివరించారు. అయితే 2024తో పోలిస్తే నష్టాల్లో 20% తగ్గుదల నమోదు అయిందని చెప్పారు.
దేశవ్యాప్తంగా నమోదైన సైబర్ ఎఫ్ఐఆర్‌లలో 44 శాతం తెలంగాణలోనే నమోదు అయిందని చెప్పారు. రూ.255 కోట్ల నుంచి రూ.279 కోట్లకు బాధితుల నిధుల రక్షణ (POH) పెరిగిందని అన్నారు. ప్రతి నాలుగు ప్రధాన నేరాల ఎఫ్ఐఆర్‌లలో ఒకటి సైబర్ నేరానిదే అని స్పష్టం చేశారు. AI, డేటా అనలిటిక్స్‌తో సైబర్ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆయన ఆదేశించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930కు కాల్ చేయాలని బాధితులకు సూచించారు. ఓటీపీ(OTP)లు, పాస్‌వర్డ్లు, బ్యాంకు వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని ప్రజలకు డీజీపీ సి.వి.ఆనంద్ హెచ్చరించారు.
సేఫ్ సిటీతో హైదరాబాద్‌కు మరింత భద్రత: డీజీపీ
సేఫ్ సిటీతో హైదరాబాద్‌కు మరింత భద్రత ఉంటుందని డీజీపీ సి.వి.ఆనంద్ తెలిపారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌పై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మహిళల భద్రతతోపాటు రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పోలీస్ - జీహెచ్‌ఎంసీతోపాటు వివిధ శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సీసీ టీవీ నిఘా వ్యవస్థను మరింత విస్తరించాలని సూచించారు. మొదటి దశలో 2,306 సీసీ టీవీలు... రెండో దశలో మరో 862 కెమెరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో మరో 12 మొబైల్ షీ టాయిలెట్ల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. షీ టీమ్స్, భరోసా సెంటర్లను మరింత బలోపేతం చేయాలని సూచించారు. 404 ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తి స్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 77 ప్రాంతాల్లో పాదచారుల సిగ్నల్స్‌పై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు. ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక నిర్వహణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ భద్రతపై ఆడియో ప్రచార వాహనాలతో ప్రజల్లో అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. సాంకేతిక ఆధారిత పోలీసింగ్‌తో హైదరాబాద్‌ను మరింత సురక్షిత నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు..!
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు: బీజేపీ ఎంపీ
Read Latest TG News And Telugu News