అల్పపీడన ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు..!
ABN , Publish Date - Jul 16 , 2026 | 07:11 PM
వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాల్లో స్పష్టమైన అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీనితో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు.
అమరావతి, జులై 16: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాల్లో స్పష్టమైన అల్పపీడనం (Well Marked Low Pressure ) కేంద్రీకృతమై ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీనితో పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రేపు (శుక్రవారం) ఆకాశం మేఘవృత ఉంటుందని చెప్పారు. దీనితోపాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
శుక్రవారం(17-07-2026) శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ సమీపంలో నిలబడ వద్దని స్పష్టం చేశారు. ఈదురు గాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగిపడి ఉంటే వాటికి వీలైనంత దూరంగా ఉండాలని ప్రజలను ప్రఖర్ జైన్ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ నష్టం జరగదు: బీజేపీ ఎంపీ
తెలంగాణ నుంచి కర్ణాటకకు రేషన్ బియ్యం స్మగ్లింగ్.. ఐదుగురి అరెస్ట్
Read Latest AP News And Telugu News