ఆన్‌లైన్ లోన్ పేరుతో మోసం... ఐదుగురి అరెస్ట్
ABN , Publish Date - Feb 11 , 2026 | 03:40 PM
ఆన్‌లైన్ లోన్ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో నిందితులు ఈ మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 11: ఆన్‌లైన్ లోన్స్(Online Loan Scam) పేరుతో అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ఐదుగురు నిందితులను హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు.. కీలక ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితులను వరంగల్ జిల్లాకు చెందిన బోచు అరుణ్, గడ్డం భరత్, సామర్ల తిరుపతి, వెల్పుగొండ తరుణ్, చుక్కా శ్యామ్‌లుగా గుర్తించారు పోలీసులు. వీరంతా మధ్యలోనే చదువులు ఆపేసి కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవారని సమాచారం. అయితే.. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వారు ఈ తరహా మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది.
ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఓ లోన్ ప్రకటన చూసి దాన్ని ఓపెన్ చేశారు. మరుసటి రోజు నిందితుల్లో ఒకరైన కిలా పవన్ కుమార్.. తనను ముద్రా లోన్ సర్వీసెస్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. 3 లక్షల రూపాయల లోన్ మంజూరైందని నమ్మబలికాడు. ప్రాసెసింగ్ ఫీజేమీ లేదని చెబుతూనే ఆధార్, పాన్ వివరాలు సేకరించాడు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, టీడీఎస్, ఇతర ఛార్జీల పేరిట ఆమె నుంచి మొత్తం రూ.1,08,274 వసూలు చేశాడు. లోన్ వద్దని బాధితురాలు చెప్పగా.. క్యాన్సిలేషన్ ఫీజు పేరుతో మరి కొంత డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.
నిందితులు ముఠాగా ఏర్పడి.. ముద్రా లోన్, ఇతర ఆన్‌లైన్ లోన్ల పేరుతో సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చేవారని పోలీసులు తెలిపారు. వడ్డీ లేకుండా, ముందస్తు చెల్లింపులేవీ అవసరం లేదని నమ్మించి.. జనాలను ఆకర్షించే వారని దర్యాప్తులో బయటపడింది. ఆసక్తి చూపిన వారి వ్యక్తిగత డేటా సేకరించి, రాష్ట్రాల వారీగా టార్గెట్ చేశారని పోలీసులు వెల్లడించారు. వీరు కోల్‌కతా, ఢిల్లీలలో ఉంటూ బాధితులకు ఫోన్ కాల్స్ చేసేవారని.. ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఇన్‌కమ్ ట్యాక్స్ ఛార్జీల పేరిట నిందితులు వసూళ్లకు పాల్పడ్డారని పోలీసులు గుర్తించారు. కోల్‌కతాలో వారికి వసతి కల్పించిన కృష్ణ అలియాస్ కిట్టు అనే వ్యక్తి ఈ మోసాలకు పాల్పడే విధానంపై శిక్షణ ఇచ్చేవాడు. ఇలా రోజూ 180 నుంచి 200 ఫోన్ కాల్స్ చేస్తూ బాధితులను దోచుకున్నారు నిందితులు. వసూలైన మొత్తంలో కృష్ణ నుంచి 30 శాతం కమిషన్ తీసుకునేవారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలాంటి మోసాల బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హెచ్చరిస్తున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి...
కేసీఆర్‌పై చర్యలు తీసుకోరా.. సీఎం రేవంత్‌కు బండి సంజయ్ సూటిప్రశ్న
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు.. భూసేకరణ షురూ..
Read Latest Telangana News And Telugu News