అంబటికి బెయిల్.. రేపు విడుదలయ్యే అవకాశం
ABN , Publish Date - Feb 11 , 2026 | 02:34 PM
ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ లభించింది. గుంటూరు ఎక్సైజ్ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
గుంటూరు, ఫిబ్రవరి 11: రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు(Former Minister Ambati Rambabu) బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్‌నూ కొట్టివేసింది న్యాయస్థానం. ప్రస్తుతం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి.. ఈ బెయిల్‌తో రేపు(గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. అంబటికి బెయిల్ రావడంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, మాజీ మంత్రి అభిమానులు.. బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు.
ఇటీవల, టీటీడీ లడ్డూ వివాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గుంటూరు నల్లపాడు పోలీస్‌స్టేషన్‌లో అంబటిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో అంబటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్‌పై తరలించారు. ఈ కేసులో అంబటికి ఇప్పటికే బెయిల్ మంజూరు అయ్యింది. ఇదిలా ఉండగా, గత ఏడాది నవంబర్ 12న పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ అంబటి రాంబాబు ఆధ్వర్యంలో గుంటూరులో వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసుల సూచనలను పట్టించుకోకపోవడంతో పాటు.. వారిపైనే దురుసుగా ప్రవర్తించారు అంబటి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా, సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటిని గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు పీటీవారెంట్‌పై ఎక్సైజ్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు మాజీ మంత్రికి ఈనెల 20 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో బెయిల్ కోసం అంబటి రాంబాబు పిటిషన్ వేయగా.. అందుకు ఎక్సైజ్ కోర్టు అనుమతి ఇస్తూ.. షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి...
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ప్రభుత్వ పాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్
జగన్ అవకాశం ఇవ్వకపోతే... సొంతంగా పోటీచేసి నా బలం చూపిస్తా: దువ్వాడ శ్రీనివాస్
Read Latest AP News And Telugu News