దళితులు, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలి
ABN , Publish Date - Sep 10 , 2026 | 07:14 AM
శాసనసభ ప్రాంగణం, దాని వెలుపల దళితులు, మహిళల గౌరవం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ గవర్నర్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
రాజ్యాంగ పరిరక్షకుడిగా జోక్యం చేసుకోవాలి
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి స్పీకర్‌ను అవమానించారు
ఈ ఘటనలకు పాల్పడినవారిని, కుట్రదారులను కఠినంగా శిక్షించాలి
గవర్నర్‌ను కోరిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు
పోలీసులు వ్యవహరించిన తీరుపై గవర్నర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): శాసనసభ ప్రాంగణం, దాని వెలుపల దళితులు, మహిళల గౌరవం, భద్రత, ఆత్మగౌరవాన్ని కాపాడాలంటూ గవర్నర్‌ను కాంగ్రెస్ పార్టీ కోరింది. రాజ్యాంగ పరిరక్షకుడిగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ‘ఈ నెల 8న జరిగిన ఘటనలతో చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుంది. బీఆర్‌ఎస్ శాసనమండలి సభ్యులు తాతా మధు, నవీన్‌రెడ్డి శాసనసభ స్పీకర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేశారు. మరణించిన ఆయన తల్లిని ఉద్దేశించి అనుచిత పదజాలాన్ని ఉపయోగించడం ద్వారా స్పీకర్‌ను తీవ్రంగా బాధించారు. మొత్తం దళిత సమాజాన్ని, రాష్ట్రంతో పాటు దేశంలోని మహిళలందరినీ అవమానించినట్లయింది. శాసనసభ ప్రధాన ద్వారం వెలుపల మీడియా కెమెరాల సాక్షిగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు, ఆ పార్టీ ఇతర నేతలు చొక్కాలు విప్పేసి పోలీసు సిబ్బందిపైకి విసిరారు. అంతటితో ఆగకుండా విధుల్లో ఉన్న మహిళా పోలీసు సిబ్బంది వైపు దూసుకెళ్లి, వారికి తాకుతూ, అత్యంత అభ్యంతరకరంగా వ్యవహరించారు. ఎమ్మెల్యే కేటీఆర్ నేతృత్వంలో పలువురు బీఆర్‌ఎస్ నాయకులు పోలీసు సిబ్బందిపై, మహిళా పోలీసు అధికారులపైనా భౌతికంగా దాడి చేశారు’ అని ఆ వినతిపత్రంలో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. దళిత సమాజానికి చెందిన సభ్యులు శాంతియుతంగా, చట్టబద్ధంగా ఎర్రవల్లి వైపు ర్యాలీగా వెళ్లి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నుంచి క్షమాపణ కోరాలని అనుకున్నారని తెలిపారు. అయితే బీఆర్‌ఎస్ అత్యంత దారుణమైన చర్యలకు పాల్పడిందని వారు ఆరోపించారు. దళిత సోదరులు, సోదరీమణులు నడిచిన రహదారులను పసుపు నీరు, పాలతో ‘శుద్ధి’ చేయడం ద్వారా నిషేధిత, చట్టవిరుద్ధమైన, అమానవీయమైన, అనైతికమైన అంటరానితనం వంటి చర్యలకు పాల్పడిందని పేర్కొన్నారు. ఈ మధ్యయుగ, భూస్వామ్య మనస్తత్వాన్ని ప్రతిబింబించే చర్యల ఫొటోలు, వీడియోలను సైతం బీఆర్‌ఎస్ నేతలు గర్వంగా ప్రచారం చేశారని తెలిపారు. ‘జర్మన్ నాజీ పార్టీ లేదా అమెరికన్ కూ క్లక్స్ క్లాన్ నుంచి తమ నైతిక విలువలను పొందుతున్న బీఆర్‌ఎస్... అంటరానితనం సాధారణంగా ఉన్న చీకటి యుగంలోకి తెలంగాణతో పాటు భారతదేశాన్ని కూడా తిరిగి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది’ అని వివరించారు. దళిత సమాజానికి బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో చేసిన ద్రోహాన్ని కాంగ్రెస్ నాయకులు వినతిపత్రంలో వివరించారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్న హామీని విస్మరించడం, దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యను అనూహ్యంగా పదవి నుంచి తొలగించడం, మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోవడం, ప్రతి దళిత కుటుంబానికి మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీని విస్మరించడం, దళిత బంధు పథకాన్ని ఎన్నికల స్టంట్‌గా మార్చడం, ఎస్సీ సబ్‌ప్లాన్‌కు సంబంధించిన రూ.1,296 కోట్ల నిధులను ఖర్చు చేయకపోవడం వంటి అంశాలను వారు ప్రస్తావించారు. ఈ ఘటనలకు ప్రత్యక్షంగా పాల్పడిన వారిపైనే కాకుండా, బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వంలో ఉన్న అసలు కుట్రదారులపై కూడా అత్యంత కఠినమైన శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌ను కోరారు.
శాంతి భద్రతల విభాగం డీజీపీకి ఫిర్యాదు
అసెంబ్లీ వద్ద మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన దాడి, మార్ఫింగ్ ఫోటోలు, ప్రభుత్వం బీఆర్‌ఎస్ చేస్తున్న కుట్రపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూధనాచారి ఆధ్వర్యంలోని బృందం శాంతి భద్రతల విభాగం డీజీపీ మహేశ్ భగవత్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ నాయకులు వివేకానంద, సుధీర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు.
కఠిన చర్యలు తీసుకోండి: బీఆర్‌ఎస్
శాసనసభ సమావేశాల తొలి రోజున జరిగిన ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం బుధవారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు వినతిపత్రం అందచేశారు. ఆ తర్వాత కేటీఆర్ లోక్‌భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ 7న పోలీసులు తమ సభ్యులపై దాష్టికాన్ని చూపించారని, తమ హక్కులను కాలరాస్తూ సభలోపలికి రాకుండా అడ్డుకున్నారని ఈ విషయాలను గవర్నర్‌కు వివరించామని వివరించారు. మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడికి సంబంధించి ఫొటోలు, ఆధారాలను గవర్నర్ దృష్టికి తీసుకుని వెళ్లామని, మహిళా నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి చీరలాగిన తీరును వివరించామని, తమపైనే దాడి చేసి తర్వాత తమనే బద్నాం చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రె్‌సకుట్రను వివరించామని, కేసీఆర్ చావును కోరుకునే స్ధాయికి కాంగ్రెస్ దిగజారిన తీరును తెలియచేశామని, కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాలు మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లిన విషయాన్ని తెలియచేశామని, దళిత స్పీకర్ అంటూ రాజకీయాలు చేస్తున్నారని, తమకి స్పీకర్‌పై అపారమైన గౌరవం ఉందని ఆయన పేర్కోన్నారు. ఈ మొత్తం వ్యవహరం వెనుక స్వయాన ముఖ్యమంత్రే ఉన్నారన్న విషయాన్ని గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. తాము ఫిర్యాదు చేసిన ప్రతి అంశంపై గవర్నర్ విచారణ జరిపిస్తామని హమీ ఇచ్చారని ఆయన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
హ్యామ్ రోడ్లకు హడ్కో రుణం
1100 ఎకరాల భూసేకరణ.. బుల్లెట్ రైల్ పనుల వేగవంతం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News