Share News

పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడొద్దు!

ABN , Publish Date - Nov 25 , 2026 | 06:31 AM

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి ఎంఏ సందీప్‌కుమార్‌.. పార్టీలో క్రమశిక్షణపైన దృష్టి పెట్టారు.

పార్టీకి నష్టం కలిగేలా మాట్లాడొద్దు!

  • రాజగోపాల్‌ రెడ్డి, అనిరుధ్‌ రెడ్డిలతో

  • భేటీ అయిన కాంగ్రెస్‌ ఇన్‌చార్జి సందీప్

  • వివాదాస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్యేల వివరణ

  • ఏదైనా ఉంటే తనకు చెప్పాలన్న ఇన్‌చార్జి

  • పెద్దపల్లి, ఆదిలాబాద్‌ పంచాయతీలపైనా నేతలతో మాట్లాడిన సందీప్‌కుమార్‌

హైదరాబాద్‌, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి ఎంఏ సందీప్‌కుమార్‌.. పార్టీలో క్రమశిక్షణపైన దృష్టి పెట్టారు. ఇటీవలి కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్రబిందువులుగా నిలిచిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిలతో సోమవారం రాత్రి విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వంపైన రాజగోపాల్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పటికే అధిష్ఠానం పరిశీలనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు విడుదల కావట్లేదని, అధికారుల్లో అవినీతి పెరిగిందంటూ అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలూ కాంగ్రెస్‌లో కలకలం సృష్టించాయి.


ఏఐసీసీ కార్యదర్శి సచిన్‌ సావంత్‌ ఆదేశాల మేరకు సందీప్‌కుమార్‌ను రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి ప్రజాభవన్‌లోని గెస్ట్‌ హౌస్‌లో కలిశారు. వారితో సందీప్‌ విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తానని తనకు హామీ ఇచ్చి అమలు చేయలేదని, అలాగే రేడియల్‌ రోడ్ల టెండర్లకు సంబంధించిన వివాదం గురించీ రాజగోపాల్‌రెడ్డి.. ఇన్‌చార్జికి వివరించినట్లు తెలుస్తోంది. సీనియర్లు అయుండీ.. పార్టీకి నష్టం కలిగేలా సీఎం రేవంత్‌, ప్రభుత్వంపైన బహిరంగ విమర్శలు చేయడం సరికాదని సందీప్‌ అన్నట్లు తెలిసింది. ఏదైనా ఉంటే తన దృష్టికి తేవాలని, తాను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని చెప్పారు. అలాగే తాను పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదంటూ అనిరుధ్‌రెడ్డి.. ఇన్‌చార్జికి వివరించారు.


అభివృద్ధి పనులకు నిధులు విడుదల కాకపోవడంతో నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. తాను సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకం కాదని, వాస్తవానికి ఆయన ఉద్దండాపూర్‌కు నిధుల కేటాయించి తనకు పెద్ద ఎత్తున మేలూ చేశారని చెప్పుకొచ్చారు. సమస్య ఏదైనా ఉంటే తనకు చెప్పాలని, తాను చూసుకుంటానని అనిరుధ్‌రెడ్డికి చెప్పారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు. ఇదిలా ఉంటే పెద్దపల్లి, ఆదిలాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లోని కాంగ్రెస్‌ నేతల మధ్య పంచాయతీపైనా ఆయా నేతలతో సందీప్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఆయా వివాదాలనూ పరిష్కరించే ప్రయత్నం చేశారు. కలిసి పనిచేసుకోవాలని, పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కాగా.. మంగళవారం సందీప్‌కుమార్‌ ఢిల్లీకి బయలుదేరి వెళ్లిపోయారు. గురువారం మళ్లీ హైదరాబాద్‌కు రానున్న ఆయన.. ఆ రోజున జరిగే సంవిధాన్‌ రక్షా ర్యాలీలో పాల్గొంటారు. 27న పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్‌ నాయకులతో ముఖాముఖీ భేటీలు నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

మారిషస్‌‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 6.4 తీవ్రత నమోదు..

సంజయ్ గాంధీని దొంగ అన్నాడని చెంపదెబ్బ కొట్టా: ప్రియాంక గాంధీ

Updated Date - Nov 25 , 2026 | 06:31 AM