Share News

ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం..

ABN , Publish Date - Sep 03 , 2026 | 05:49 AM

మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ అత్యంత కఠిన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది.

ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం..
Konda Surekha

  • అపాయింట్‌మెంట్‌ ఇవ్వని కేసీ వేణుగోపాల్‌

  • రోజంతా ఏఐసీసీ కార్యాలయంలో పడిగాపులు

  • క్లుప్తంగా మాట్లాడి పంపించిన మల్లికార్జున ఖర్గే

  • నిరాశతో వెనుదిరిగిన మంత్రి సురేఖ

  • ఖర్గే, వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా భేటీ

  • కొండా వ్యవహారాన్ని అంతర్గత అంశంగా చూడొద్దు

  • క్రమశిక్షణా రాహిత్యంగా చూడాలని కోరిన రేవంత్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్‌ హైకమాండ్‌ అత్యంత కఠిన వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించడం దాదాపు ఖాయమైనట్లే కనిపిస్తోంది. అధిష్ఠానం పెద్దలను కలిసి వివరణ ఇచ్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన సురేఖకు ఇక్కడ ఊహించని పరాభవం ఎదురైంది. ఆమె వివరణను వినేందుకు కూడా అధిష్ఠానం ఆసక్తి చూపలేదు. రోజంతా ఏఐసీసీ కార్యాలయంలోనే వేచి చూసినప్పటికీ.. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ఆమెకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చేందుకు నిరాకరించారు. చివరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు వెళ్లగా.. ఆయన కూడా కేవలం కంటితుడుపు చర్యగా క్లుప్తంగా మాట్లాడి పంపించివేశారు. ఎలాంటి హామీ, ఊరట లభించకపోవడంతో కొండా సురేఖ తీవ్ర నిరాశ, అసంతృప్తితో ఢిల్లీ నుంచి వెనుదిరిగారు. వెళ్లే ముందు ముఖ్యమంత్రిపై, ఉపముఖ్యమంత్రిపై ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో.. ఇక వేటు వేయాల్సిందేనన్న నిర్ణయానికి అధిష్ఠానం వచ్చినట్లు తెలుస్తోంది. ఏ క్షణంలోనైనా ఆమెను బర్తరఫ్‌ చేసే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌ బుధవారం మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లతో వేర్వేరుగా భేటీ అయ్యారు. తొలుత మీనాక్షీ నటరాజన్‌, మహేశ్‌గౌడ్‌ సమావేశమై.. కొండా సురేఖ అంశంపై సమగ్ర నివేదికను, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సూచనలను హైకమాండ్‌ ముందు ఉంచారు. భవిష్యత్తులో ఎవరూ పార్టీ లైన్‌ దాటకుండా ఉండేందుకు కఠిన చర్యలు తప్పనిసరి అని అన్నారు. అయితే తుది నిర్ణయాన్ని అధిష్ఠానానికే వదిలేస్తున్నామని తెలిపారు.


అంతర్గత ప్రజాస్వామ్యంగా చూడొద్దు..!

మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లను సీఎం రేవంత్‌రెడ్డి వేర్వేరుగా కలిశారు. మంగళవారం రాత్రే కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన రేవంత్‌.. బుధవారం మరోసారి కేసీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఖర్గేను కలిశారు. ప్రభుత్వానికి, పార్టీకి నష్టం చేకూర్చిన కొండా సురేఖ వ్యవహారాన్ని అంతర్గత ప్రజాస్వామ్యంగా కాకుండా, తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధిష్ఠానాన్ని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిసింది. అలాగే, ప్రభుత్వానికి రెండున్నరేళ్ల కాలం ముగిసినందున.. మంత్రుల పనితీరు, సమర్థత ప్రాతిపదికన మంత్రివర్గ ప్రక్షాళనకు అనుమతించాలని కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా సామాజిక సమీకరణాలు, ప్రాంతాల వారీగా ఆశావాహుల జాబితాను, నామినేటెడ్‌ పోస్టులు, త్వరలో జరగబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల వివరాలను అధిష్ఠానానికి అందజేశారు. ఇవే కాకుండా రాష్ట్రంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్ఐఆర్‌), వెయ్యిరోజుల పాలనపైనా అధిష్ఠానంతో రేవంత్‌ చర్చించినట్లు తెలిసింది.


ఖర్గే కారులోనే రేవంత్‌..

మల్లికార్జున ఖర్గే బుధవారం సాయంత్రం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో వైఎస్సార్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రాగా.. సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఖర్గే కారులోనే అక్కడికి వచ్చారు. రేవంత్‌ తొలుత ఖర్గే నివాసానికి వెళ్లి.. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కారులో వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ ప్రయాణ సమయంలో ఇద్దరూ ఏం చర్చించుకున్నారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ నుంచి ఖర్గే ఇంటికి వెళ్లేటప్పుడు ఆయన వెంట కారులో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వెళ్లారు. ఆ వెంటనే మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సైతం ఖర్గే నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఖర్గేతో భట్టి, ఉత్తమ్‌ వేర్వేరుగా చర్చించినట్లు తెలిసింది. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో.. ఆ తర్వాత ఒకేసారి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అప్పుడే కొండా సురేఖకు ఉద్వాసన పలకాలని అధిష్ఠానం భావిస్తున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా?

కొండ సురేఖ మదిలో ప్లాన్‌ బి?

Updated Date - Sep 03 , 2026 | 05:58 AM