Share News

ఏఐ స్కిల్స్‌ ఉంటేనే భారీ జీతాలు!

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:37 AM

ఐటీ రంగంలో ఇక అనుభవం ఉంటే సరిపోదు.. కంపెనీలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యం ఉంటేనే భారీ జీతం! భారత టెక్నాలజీ ఉద్యోగ మార్కెట్‌లో ప్రస్తుతం ఇదే కొత్త ట్రెండ్‌గా మారుతోంది

ఏఐ స్కిల్స్‌ ఉంటేనే భారీ జీతాలు!
AI

  • సంప్రదాయ ఉద్యోగాలకు తగ్గుతున్న వేతనాలు.. ఏఐ రంగంలో జీతాలు రెండేళ్లలో 23శాతం వృద్ధి

  • సెమీకండక్టర్ల రంగంలో 17 శాతం పెరుగుదల

  • ఏఐ ఉద్యోగ కేంద్రంగా మారుతున్న హైదరాబాద్‌

  • పెరుగుతున్న ప్రత్యేక నైపుణ్యాల డిమాండ్‌

  • ఫౌండిట్‌ నివేదిక వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఐటీ రంగంలో ఇక అనుభవం ఉంటే సరిపోదు.. కంపెనీలకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యం ఉంటేనే భారీ జీతం! భారత టెక్నాలజీ ఉద్యోగ మార్కెట్‌లో ప్రస్తుతం ఇదే కొత్త ట్రెండ్‌గా మారుతోంది. కృత్రిమ మేధ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్‌ వంటి ప్రత్యేక రంగాల్లో పనిచేసేవారికి జీతాలు వేగంగా పెరుగుతుండగా.. సంప్రదాయ ఐటీ సర్వీసులు, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, ఈ-కామర్స్‌ వంటి విభాగాల్లో తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా ఉద్యోగ పోర్టల్‌ ఫౌండిట్‌ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఏఐ రంగంలోని ఉద్యోగుల జీతాలు గత ఏడాదితో పోలిస్తే 12శాతం పెరిగాయి. గతేడాది కూడా 11శాతం పెరిగాయి. రెండేళ్లలో కలిపి 23 శాతం వృద్ధి నమోదైంది. ఏఐ రంగంలో ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లోనే ఇతర సాధారణ ఐటీ ఉద్యోగాలతో పోలిస్తే ఎక్కువ జీతం లభిస్తోంది. మూడేళ్లలోపు అనుభవం ఉన్న ఏఐ నిపుణులు ఏడాదికి రూ.8.87 లక్షల నుంచి 15.41 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వారి వార్షిక వేతనం రూ.71 లక్షల నుంచి రూ.89.24 లక్షల వరకు ఉంటోంది. సైబర్‌ సెక్యూరిటీ రంగంలో సీనియర్‌ ఉద్యోగులకు భారీ వేతనాలు లభిస్తున్నాయి. కంప్యూటర్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ విభాగంలో 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న నిపుణుల వేతనం గరిష్ఠంగా రూ.97.81 లక్షల వరకు ఉండటం గమనార్హం.


తగ్గిన హార్డ్‌వేర్‌, ఈ-కామర్స్‌ రంగం జీతాలు

ఒకప్పుడు ఐటీ సర్వీసుల రంగంలో అనుభవం పెరిగే కొద్దీ జీతం కూడా భారీగా పెరుగుతుందనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోందని నివేదిక గణాంకాలు తెలుపుతున్నాయి. సాధారణ ఐటీ, ఐటీ సర్వీసుల ఉద్యోగాల్లో మూడేళ్లలోపు అనుభవం ఉన్న వారికి ఏడాదికి రూ.2.68 లక్షల నుంచి రూ.5.08 లక్షల వరకు వేతనం ఉంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న వారి వేతనం రూ.57.55 లక్షల నుంచి రూ.72.13 లక్షల వరకు ఉంది. ఈ రెండు విభాగాల్లోనూ 2026లో జీతాలు 1 శాతం తగ్గాయి. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, ఈ-కామర్స్‌ రంగాల్లో పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉందని నివేదిక వెల్లడిస్తోంది. హార్డ్‌వేర్‌ ఉద్యోగుల వేతనాలు 2025లో 3 శాతం, 2026లో మరో 4 శాతం తగ్గాయి. ఈ-కామర్స్‌ రంగంలోనూ 2025లో 4 శాతం, 2026లో 3 శాతం తగ్గుదల నమోదైంది. ఇంటర్నెట్‌ రంగంలో వరుసగా రెండేళ్లూ 2 శాతం చొప్పున వేతనాలు తగ్గాయి. దీనికి భిన్నంగా కంప్యూటర్‌ అండ్‌ నెట్‌వర్క్‌ సెక్యూరిటీలో 2026లో 9 శాతం, డేటా మైనింగ్‌లో 7 శాతం, అనలిటిక్స్‌లో 5 శాతం వేతన వృద్ధి నమోదైంది


హైదరాబాద్‌కు కొత్త అవకాశాలు

బెంగళూరు ఇప్పటికీ దేశంలో ఏఐ ఉద్యోగాలకు అత్యధిక వేతనాలు అందిస్తున్న నగరంగా కొనసాగుతోంది. అక్కడ 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ఏఐ నిపుణులు రూ.61.70 లక్షల నుంచి రూ.91.25 లక్షల వరకు వార్షిక వేతనం పొందుతున్నారు. హైదరాబాద్‌ కూడా వేగంగా ఎదుగుతున్న ఏఐ ఉద్యోగ కేంద్రంగా మారుతోంది. భాగ్యనగరంలో గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), ప్రొడక్ట్‌ ఇంజనీరింగ్‌ సంస్థలు, ఏఐ ఆధారిత స్టార్ట్‌పలు పెరుగుతుండటంతో ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఏఐ, డేటా సైన్స్‌, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ రంగాల్లో హైదరాబాద్‌లో డిమాండ్‌ బలపడుతోంది. బెంగళూరు, ఎన్‌సీఆర్‌, ముంబై వంటి ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ కూడా ఏఐ ప్రతిభకు కీలక కేంద్రంగా మారే దిశగా సాగుతోందని ఉద్యోగ మార్కెట్‌ ధోరణులు సూచిస్తున్నాయి. కోయంబత్తూర్‌, కొచ్చి, అహ్మదాబాద్‌, చండీగఢ్‌, జైపూర్‌, ఇండోర్‌ వంటి టైర్‌ 2 నగరాల్లో ఏఐ ఉద్యోగాలు పెరుగుతున్నప్పటికీ.. ఎక్కువ అనుభవం ఉన్న నిపుణులు మాత్రం ఇంకా బెంగళూరు, హైదరాబాద్‌, ముంబై, ఎన్‌సీఆర్‌ వంటి ప్రధాన టెక్‌ హబ్‌ల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు.


సెమీకండక్టర్ల రంగంలో జోరు

ప్రత్యేక నైపుణ్యాలున్న ఉద్యోగులకు డిమాండ్‌ కేవలం ఏఐ రంగానికే పరిమితం కాలేదు. సెమీకండక్టర్‌ రంగంలో రెండేళ్లలో వేతనాలు 17 శాతం పెరిగాయి. 2026లోనే ఈ రంగంలో 9శాతం వృద్థి నమోదైంది. ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌ రంగంలో రెండేళ్లలో 13 శాతం వేతన వృద్ధి నమోదైంది. ఈ రంగంలో సీనియర్‌ నిపుణులు గరిష్ఠంగా రూ.58.90 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంది. సెమీకండక్టర్‌ రంగంలో సీనియర్‌ ఉద్యోగుల వేతనం రూ.48.49 లక్షల వరకు ఉంది. మొత్తంగా చూస్తే ఉద్యోగంలో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న దానికంటే.. ప్రస్తుతం మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యం ఏమిటన్నదే ఉద్యోగి వేతనాన్ని నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోంది. ఏఐ సిస్టమ్‌ల అభివృద్ధి, సైబర్‌ భద్రత, డేటా విశ్లేషణ, ఇండస్ట్రియల్‌ ఆటోమేషన్‌, సెమీకండక్టర్ల వంటి రంగాల్లో నైపుణ్యాలను పెంచుకుంటున్న వారికి రాబోయే రోజుల్లో మరింత మెరుగైన అవకాశాలు, భారీ వేతనాలు దక్కే అవకాశం ఉంది.

Updated Date - Sep 03 , 2026 | 04:37 AM