మున్సిపల్ ఎన్నికలు.. మంత్రులకు సీఎం దిశానిర్దేశం
ABN , Publish Date - Feb 03 , 2026 | 09:46 PM
మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంపై మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఈ ఎన్నికల్లో విజయంపై నివేదికలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయని వారికి తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 03: పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటినట్లే మున్సిపల్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని తన కేబినెట్ సహచర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార వ్యూహాలపై మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో తన కేబినెట్ మంత్రులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించడంపై వారితో సమీక్షించారు. ఈ ఎన్నికల్లో విజయంపై నివేదికలన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉన్నాయని వారికి సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారికి సర్వే నివేదికలు అందజేశారు. అన్ని మున్సిపాలిటీల్లో గెలువబోతున్నామని జోస్యం చెప్పారు సీఎం రేవంత్. అయినా ఎన్నికల చివరి వరకు చాలా అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. ఇంకా ఎవరైనా రెబల్స్ ఉంటే.. వారిని రాజీ చేయాలని ఆదేశించారు.
మంత్రులందరూ జిల్లాలకు వెళ్లాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అలాగే సర్వేల్లో వెనకబడిన మున్సిపాలిటీలను ఈ సందర్భంగా మంత్రులకు ఆయన సోదాహరణగా వివరించారు. అదే విధంగా జిల్లాల పర్యటన వివరాలను మంత్రులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా ఇంఛార్జ్ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజు వారి రిపోర్ట్ తనకు అందించాలని ఈ సందర్భంగా మంత్రులకు స్పష్టం చేశారు. ఇక అసంతృప్తి నేతలను బుజ్జగించాలని మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలతోపాటు పలు మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. నామినేషన్ల విత్ డ్రా సైతం నేటితో ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీన వెలువడనున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఇప్పటికే ఎవరికి వారు రంగంలోకి దిగి తమ సత్తా చాటేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వ సహాయ సహకారాలు: సీఎం చంద్రబాబు
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ సతీమణి
For More TG News And Telugu News