Share News

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వ సహాయ సహకారాలు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 03 , 2026 | 09:01 PM

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిన్నరలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనూహ్య ప్రగతి సాధించింది. గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) ప్రస్తుతం లాభాల బాట పట్టింది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వ సహాయ సహకారాలు: సీఎం చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 03: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌కు పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఉంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. మంగళవారం నాడు రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతిపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల్లో కొత్త విధానాలు ప్రవేశపెట్టి ప్లాంట్‌ను మరింత బలోపేతం చేయాలని వారికి సూచించారు. అలాగే కార్మికులు, ఉద్యోగుల సమర్థ వినియోగంతో మరిన్ని మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యాజమాన్యం, కార్మికులు, ప్రభుత్వాలు కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను విజయపథంలో నడపాలని ఆకాంక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సింగరేణి సంస్థలో అమలు చేసిన సంస్కరణలు.. కార్మికుల సహకారంతో సాధించిన ఫలితాలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.


మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిన్నరలో విశాఖ స్టీల్ ప్లాంట్ అనూహ్య ప్రగతి సాధించింది. గతంలో ఎదుర్కొన్న నష్టాల నుంచి ఈ స్టీల్ ప్లాంట్ (ఆర్ఐఎన్ఎల్) ప్రస్తుతం లాభాల బాట పట్టింది. హాట్ మెటల్ ప్రొడక్షన్‌లో రోజుకు 19,401 టన్నుల ఉక్కు ఉత్పత్తికి ఈ సంస్థ చేరుకుంది. 2024-25 రెండో త్రైమాసికం (సెకండ్ క్వార్టర్‌)లో కేవలం రోజుకు 9,215 టన్నుల మాత్రమే ఈ సంస్థ ఉత్పత్తి చేసేది. మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు పని చేస్తుండడంతో భారీగా ఉత్పత్తి పెరిగింది. స్టీల్ ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్‌లో రికార్డు స్థాయిలో 94 శాతానికి చేరుకుంది. 2024-25 రెండో త్రైమాసికం (సెకండ్ క్వార్టర్‌)లో కేవలం రోజుకు 45 శాతం మాత్రమే ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.


ఈ ఆర్థిక నష్టాల నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో దూసుకెళ్తోంది. 2024 సెప్టెంబర్‌లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి.. 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని విశాఖ స్టీల్ సాధించింది. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ.11 వేల కోట్ల సాయంతో విశాఖ స్టీల్ నిలదొక్కుకుంది. ప్రస్తుతం ఈ స్టీల్ ప్లాంట్‌కు క్రెడిట్ రేటింగ్ పెరిగినట్లు అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర ఉక్కు కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

ఇది మన ప్రజాస్వామ్యానికి మచ్చ: రాహుల్ గాంధీ

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న పవన్ సతీమణి

For More AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 09:40 PM