ఎస్ఐఆర్‌ను ఆషామాషీగా తీసుకోవద్దు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Jun 15 , 2026 | 09:27 PM
ఎస్ఐఆర్ విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎస్ఐఆర్‌పై టీపీసీసీ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్15: ఎస్ఐఆర్ విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఎస్ఐఆర్‌పై టీపీసీసీ జూమ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్ఐఆర్‌లో భాగంగా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఓట్లలో మెజార్టీ శాతాన్ని ఒక కారణంతో పక్కన పెట్టారని తెలిపారు. వాటిని అనుమానాస్పదం పేరుతో వాటిని తొలగించే ప్రయత్నం జరుగుతుందన్నారు. అదే జరిగితే రాజకీయంగా అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2028 ఎన్నికలకు 2026 అక్టోబరులోనే ఓటర్ల జాబితా ఫైనల్ అవుతుందని చెప్పారు.
ఓట్లు తొలిగిపోతే ఆ తర్వాత చేసేదేం లేదని పెదవి విరిచారు. 119 నియోజకవర్గాలలోని ప్రతీ గ్రామంలో, ప్రతీ బూత్‌లో బీఎల్‌ఓ (BLO)లతో ముఖ్య నాయకులను అనుసంధానం చేసుకోవాల్సి ఉందన్నారు. వలసలు వెళ్లిన ఓటర్లు.. బీఎల్‌ఓలు వెళ్ళినపుడు నివాసంలో ఉండక పోవచ్చునని పేర్కొన్నారు. అలాంటి ఓట్లను తొలగించకుండా జాగ్రత్త వహించాల్సి ఉందన్నారు. జూన్ 20వ తేదీ లోగా జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులు సంబంధిత పార్లమెంటు, అసెంబ్లీ ఇన్‌చార్జిలతో సమీక్ష నిర్వహించుకోవాల్సి ఉందని తెలిపారు. సంబంధిత ఇన్‌చార్జి మంత్రులు జిల్లా స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
ఎక్కడైనా సమస్య తలెత్తితే.. సంబంధిత అసెంబ్లీ ఇన్‌చార్జిను అప్రమత్తం చేయాల్సి ఉంటుందని సూచించారు. 17 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడైనా సమస్య వస్తే.. ఆ సంబంధిత పార్లమెంట్ ఇన్‌చార్జిదే బాధ్యత అని కుండబద్దలు కొట్టారు. అసెంబ్లీ పరిధిలో నియోజకవర్గ ఇన్‌చార్జిలు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్‌ను ఆషామాషీగా తీసుకోవద్దు.. సీరియస్‌గా తీసుకోవాల్సిందేనని సీఎం రేవంత్ కుండబద్దలు కొట్టారు.
ఇది అత్యంత ప్రమాదకరమైన సందర్భం.. అప్రమత్తంగా ఉండాలంటూ ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేశారు. లోక్‌సభ ఇన్‌చార్జిలు నియోజకవర్గ పరిధిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. గాంధీ భవన్‌లో వార్ రూమ్ ఏర్పాటు చేసి బూత్ స్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు. ఏ రోజుకు ఆ రోజు నివేదిక తెప్పించుకోవాలని స్పష్టం చేశారు. ఎవరు నిర్లక్ష్యం వహించినా నష్టం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి: మీనాక్షి నటరాజన్
ఎస్ఐఆర్ విషయంలో దేశంలో జరిగిన పరిణామాలు మనం గమనించాలని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. బీజేపీ, ఎన్నికల సంఘం (ఈసీ) ఓటు చోరీనే పనిగా పెట్టుకున్నాయని మండిపడ్డారు. ఆమె కూడా ఈ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో ఎలా జరిగిందో? మనం చూశామన్నారు. ఇక్కడ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త చాలా అప్రమతంగా ఉండాల్సి ఉందని పేర్కొన్నారు. ఓట్ మాప్, ఓట్ ఆన్ మాప్, డౌట్ ఓట్స్ అన్ని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉందన్నారు.
పాత ఓటర్ లిస్ట్‌కు ఇప్పటి ఓటర్ లిస్ట్‌కు చిన్న చిన్న పొరపాట్లు ఉన్న ఓట్ తొలగిస్తారని చెప్పారు. ఓటును నిలబెట్టడానికి అవసరమైన అన్ని పత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. అందుకోసం ప్రతి కార్యకర్త అవగాహన పెంచుకొని ప్రజల్లో చైతన్యం తేవాలని సూచించారు. ప్రదానంగా నిరక్షరాస్యులు, పేద వారు ఇక్కడ నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క ఓటు కూడా నష్టం జరగొద్దు.. ఇది కేవలం ఒక ఓటు మాత్రమే కాదు ప్రజల హక్కు దాన్ని మనం కాపాడాల్సి ఉందని మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువ: సీఎం రేవంత్
తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
Read Latest TG News And Telugu News