ప్రజలకు కాపలాదారులుగా ఉంటాం: సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 13 , 2026 | 09:12 PM
మూసీ ప్రాజెక్టుపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరికొందరు అసంపూర్తి సమాచారంతో తప్పుడు ప్రచారం చేశారన్నారు.
అమరావతి, మార్చి 13: మూసీ ప్రాజెక్టుపై కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మరికొందరు అసంపూర్తి సమాచారంతో తప్పుడు ప్రచారం చేశారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో మూసీ ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వేగంగా అభివృద్ధి వైపు పయనిస్తున్నాయని తెలిపారు. మనం కూడా అభివృద్ధి వైపు పయనించాలనే మూసీ పునరుజ్జీవం చేస్తున్నట్లు సీఎం రేవంత్ వివరించారు.
ప్రజలు మమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చారన్నారు. వారికి తాము కాపాలదారులుగా ఉంటామని స్పష్టం చేశారు. సింగపూర్, దుబాయ్, లండన్, సియోల్ నగరాలలో తాను పర్యటించానని చెప్పారు. మనకు ఏం అవసరమో అక్కడ స్టడీ చేసి వచ్చామన్నారు. నదీ పరీవాహక ప్రాంతాల్లోనే ఆర్థిక వ్యవస్థ విరాజిల్లిందన్నారు.
గొప్ప నగరం హైదరాబాద్‌ను నిజాం రాజులు మనకు అందించారని తెలిపారు. వందేళ్ల క్రితం నిర్మించిన జలాశయాలు నేటికీ ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయని చెప్పారు. మూసీ అభివృద్ధి బాధ్యతాయుతంగా చేపట్టాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. తమకు పొలిటికల్ డిఫరెన్స్ ఉండొచ్చు.. కానీ పొలిటికల్ పెరాలసిస్ లేదని కుండబద్దలు కొట్టారు.
మూసీ పునరుజ్జీవనాన్ని బీఆర్ఎస్, బీజేపీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని ఆయన సందేహం వ్యక్తం చేశారు. వ్యతిరేకించడం కాదు.. ఎలా చేద్దామో సలహా ఇవ్వండంటూ ఆయా పార్టీల అధినేతలు, అగ్రనేతలకు సీఎం రేవంత్ సూచించారు. మీ సలహాలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రపంచంతో పోటీ పడుతూ అభివృద్ధి జరగొద్దా? అని ఆయా పార్టీల నేతలకు సీఎం రేవంత్ ఈ సందర్భంగా చురకలంటించారు.
అపార మేధో సంపత్తి ఉందని చెప్పేవారు ప్రాజెక్టుల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డారు. పాలసీలు, వర్కింగ్ స్టైల్ మార్చుకున్నామని చెప్పారు. కొద్దిమంది ముఖ్యమంత్రులే ప్రజలకు గుర్తున్నారని పేర్కొన్నారు. వారు వేసిన పునాదులే అలా గుర్తుంచుకునేలా చేశాయని చెప్పారు. ఎంతసేపు రంగారెడ్డి జిల్లా గురించే ఆలోచిస్తున్నారన్నారు. నల్గొండ జిల్లా గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నించారు.
మేం తెచ్చే ప్రాజెక్ట్ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. బుల్‌డోజర్లతో కూల్చేస్తున్నారని అంటున్నారని చెప్పారు. అవి చదువుకున్నవాళ్లు మాట్లాడే మాటలా అని ప్రతిపక్షాలను ఆయన సూటిగా ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టును అడ్డుకునే వాళ్లు మూడు నెలలు అక్కడ నివసిస్తారా? అంటూ ప్రతిపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు.
కన్యాకుమారి లాగా బాపూఘాట్ కూడా రెండు నదుల సంగమం అని ఎంతమందికి తెలుసునని ప్రశ్నించారు. గోదావరి జలాల్లో 20 టీఎంసీలను మూసీకి తరలించే పనులు చేపట్టినట్లు తెలిపారు. మూసీలో నిరంతరం 2.5 టీఎంసీల గోదావరి జలాలు ప్రవహించేలా చర్యలు చేపట్టామని వివరించారు. గాంధీ విగ్రహానికి సుమారుగా రూ.75 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ విగ్రహానికి కోట్లు ఖర్చు చేస్తే తాము వ్యతిరేకించలేదని సీఎం రేవంత్ చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులకు గుడ్ న్యూస్.. వెంటనే ఖాతాలు చెక్ చేసుకోండి
తానా ఫౌండేషన్ ‘మహిళా సాధికారత’ భారీగా కుట్టు మిషన్లు పంపిణీ
For More TG News And Telugu News