రైతులకు గుడ్ న్యూస్.. వెంటనే ఖాతాలు చెక్ చేసుకోండి
ABN , Publish Date - Mar 13 , 2026 | 07:22 PM
రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో రైతుకు రూ. 6 వేలు ఇస్తున్నామన్నారు. రైతు ఖాతాలో ఏటా రూ.20 వేలు జమ చేస్తున్నామని తెలిపారు.
విజయవాడ, మార్చి13: రాష్ట్రంలోని రైతులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఒక్కో రైతుకు రూ. 6 వేలు ఇస్తున్నామన్నారు. రైతు ఖాతాలో ఏటా రూ.20 వేలు జమ చేస్తున్నామని తెలిపారు. కేంద్రం రూ. 6 వేలు ఇస్తే.. మేం రూ.14 వేలు ఇస్తున్నామని చెప్పారు. శుక్రవారం కృష్ణాజిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని.. రైతుల ఖాతాల్లోకి ఈ పథకానికి సంబంధించిన రూ. 6 వేలు నిధులు విడుదల చేశారు.
అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రైతులు సైతం టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారని అన్నారు. రైతుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. పంటలకు సమయానికి సాగునీరు ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా జలాలతో కలిపామని సీఎం చంద్రబాబు వివరించారు.
ప్రధాని మోదీ అసోంలో ఉండి దేశంలోని రైతులందరి ఖాతాల్లో నగదు వేశారని.. ఇది టెక్నాలజీకి ఉండే మహిమ అని వివరించారు. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన నగదు అక్కడ విడుదల చేస్తే.. మనం ఇక్కడ విడుదల చేశామని సీఎం చెప్పారు. అవన్నీ మీ ఖాతాల్లో ఇప్పుడు పరిశీలించుకునే పరిస్థితికి వచ్చిందంటే.. టెక్నాలజీ ఏ విధంగా పని చేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ రోజు ఎన్నికల ముందు తాను, పవన్ కళ్యాణ్ రాష్ట్రవ్యాప్తంగా తిరిగి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడంతోపాటు రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని మాట ఇచ్చామని చెప్పారు. అందుకే సూపర్ సిక్స్ పథకాలతోపాటు ఇంకొన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చామని పేర్కొన్నారు. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యామని సీఎం చంద్రబాబు వివరించారు. గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసిందనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఈ రోజు మూడో విడతలో 46,85,000 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ. 6 వేలు డిపాజిట్ చేస్తున్నామని తెలిపారు.
అటు కేంద్రం కానీ.. ఇటు రాష్ట్రం కానీ ఇద్దరం కలిపి మొత్తం రూ. 20 వేల అందిస్తున్నామన్నారు. ఈ విషయం రైతులందరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. తాను రైతు బిడ్డనని.. మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. రైతు కుటుంబాలు ఇబ్బందుల్లో ఉండకూదనే తన ఆలోచన, తపనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టించామని చెప్పారు.
కృష్ణాజిల్లాలో నీళ్లు ఆలస్యంగా రావడం వల్ల తుపాన్‌తో రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు ఇవ్వడం ద్వారా పంటలను కాపాడామన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల సుడిగుండంలో ఉందన్నారు. ఏపీ ఇమేజ్ దెబ్బ తిందని.. పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా నిలిచిపోయేలా చేశారన్నారు.
ఈ ఇరవై నెలల్లో ఒక్కోక్క సమస్యను పరిష్కారించుకుంటూ వస్తున్నామని సీఎం చంద్రబాబు వివరించారు. ఇన్ని సమస్యలున్నా.. మీకు న్యాయం చేసిన ప్రభుత్వం ఎన్డీయే ప్రభుత్వమని ధైర్యంగా చెబుతున్నానన్నారు. 47లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 24 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు వేశామని పేర్కొన్నారు.
ప్రకృతి విపత్తుల సమయంలో ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చామని.. రూ. 300 కోట్లు పరిహారం, రూ.500 కోట్ల ధరల స్థిరీకరణకు కేటాయించామని గణాంకాలతో సహా సీఎం చంద్రబాబు వివరించారు. పక్కనే ఉన్న తమిళనాడు కానీ.. కర్ణాటక కానీ రైతులకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. కానీ ఏపీలో రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చిన ఏకైక ప్రభుత్వం.. ఎన్డీయే ప్రభుత్వమని స్పష్టం చేశారు. పొగాకు, ఉల్లి రైతులను ఆదుకునేలా ఆర్థిక సాయం అందించామని చెప్పారు.
టమోటా, కోకో పంటలు దెబ్బ తింటే.. మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నామన్నారు. నష్టపోయిన రైతాంగానికి రూ.1,338 కోట్లు అందచేశామని గుర్తు చేశారు. తాము విజన్ 2047 తయారు చేశామని చెప్పారు. ప్రధాని నేతృత్వంలో వికసిత్ భారత్, ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 కల సాకారం అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మనకు స్వాతంత్ర్యం వచ్చి 2047 నాటికి వందేళ్లు అవుతుందన్నారు. ఆ సమయానికి మన దేశం, మన రాష్ట్రం అన్ని విధాలా అగ్రస్థానంలో ఉండాలని ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు కాపలాదారులుగా ఉంటాం: సీఎం రేవంత్
తానా ఫౌండేషన్ ‘మహిళా సాధికారత’ భారీగా కుట్టు మిషన్లు పంపిణీ
For More AP News And Telugu News