CM Revanth Reddy: బీఆర్ఎస్ పాలకుల ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చాయి: సీఎం
ABN , Publish Date - Jan 16 , 2026 | 08:01 PM
బీఆర్ఎస్ పాలకుల ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చాయని గ్రూప్ - 3 ఉద్యోగ విజేతలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు.
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రాణ త్యాగాలతో సాధించుకున్నామని.. కానీ బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆశలు నెరవేరలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ పాలకులు ఆడుకున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో ఆ పార్టీ నేతలు.. వారి స్వప్రయోజనాలే చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఓపిక నశించిన యువత.. కేసీఆర్‌ను ఇంటికే పరిమితం చేశారని వ్యంగ్యంగా అన్నారు. శుక్రవారం హైటెక్ సిటీ సమీపంలోని శిల్పకళా వేదికలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. గ్రూప్ - 3కి ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలకుల ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చాయని గ్రూప్ - 3 విజేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకూడదని కోర్టుల్లో కేసులూ వేశారంటూ బీఆర్ఎస్ నేతల వైఖరిని తప్పు పట్టారు. అన్ని అవరోధాలు అధిగమించి ఉద్యోగాలు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ - 1 నియమకాలు చేపట్టలేదన్నారు. గతంలో నియామక పరీక్షలు కూడా సరిగా నిర్వహించలేదని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
దాంతో నిరుద్యోగులు తమ విలువైన సమయం కోల్పోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వచ్చాక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామన్నారు. యూపీఎస్‌సీ తరహాలోనే టీజీపీఎస్‌సీని సంస్కరించామని తెలిపారు. ఇప్పటి వరకు 70 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. గతంలో అర్హత లేనివారికి టీజీపీఎస్‌సీలో కీలక ఉద్యోగాలు ఇచ్చారంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలపై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు.
ఈ కొలువుల పండగ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ గ్రూప్- 3 పరీక్షల్లో విజేతలుగా నిలిచి వారిని మొత్తం 25 ప్రభుత్వ శాఖల్లో నియమించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శ్యామలా నవరాత్రులు.. ఎప్పటి నుంచంటే..
For More TG News And Telugu News