Share News

ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశం

ABN , Publish Date - Jun 23 , 2026 | 11:17 AM

దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశం
CM Revanth Reddy

న్యూఢిల్లీ, జూన్ 23: దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఈరోజు(మంగళవారం) ఉదయం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్.. ఖట్టర్‌తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ పాల్గొన్నారు. ఖట్టర్ నివాసంలో దాదాపు 40 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో.. హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. మెట్రో ప్రాజెక్టుకు అప్పులు, రెండో ఫేజ్‌కు అనుమతులు, నిధులు కావాలని సీఎం రేవంత్ కోరినట్లు సమాచారం. సమావేశంలో సీఎస్ రామకృష్ణ రావు, మెట్రో రైల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.


రెండు రోజులుగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న(సోమవారం) కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అశ్విని వైష్ణవ్‌తో సమావేశమై.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు.. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కలిశారు. అలాగే, తెలంగాణ మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు ఈరోజు ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద జోషిని ఇరువురు మంత్రులు కలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని కోరనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశమై.. యూరియా సరఫరా పెంచాలని మంత్రులు ఉత్తమ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేయనున్నారు.


ఇవి కూడా చదవండి...

అపార్ట్‌మెంట్‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరి అరెస్ట్

ఎక్సైజ్ సూపరింటెండెంట్‌ మల్లారెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 23 , 2026 | 11:44 AM