Share News

ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:08 AM

పాపాల భైరవుడు కేసీఆర్‌. ఆ దరిద్రుడు పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. కానీ, ఆయనో ఫాంహౌజ్‌.. కొడుకో ఫాంహౌజ్‌.. అల్లుడో ఫాంహౌజ్‌..

ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తా

  • అలా చేయకపోతే నా పేరు మార్చుకుంటా

  • వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం

  • కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి సవాల్‌

  • ఆ దరిద్రుడు పేదలకు ఇళ్లు ఇవ్వలేదు కానీ ఆయన, కొడుకు, బిడ్డ ఫాంహౌజ్‌లు కట్టుకున్నారు

  • ఆయన చేసిన పాపాలకు ఉరి తీసినా తప్పు కాదు

  • నిజాం సర్కార్లో అయితే చెట్టుకు కట్టేసి కొట్టేవాళ్లు

  • 15 ఎంపీ స్థానాలు గెలిచి రాహుల్‌ను ప్రధానిని చేద్దాం

  • వైఎస్-డీఎస్‌లా మహేశ్‌, నేను.. మళ్లీ అధికారంలోకి

  • భూపాలపల్లి జిల్లా బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి

  • రైతు భరోసా రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం

వరంగల్‌ , ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ‘‘పాపాల భైరవుడు కేసీఆర్‌. ఆ దరిద్రుడు పేదలకు ఇళ్లు ఇవ్వలేదు. కానీ, ఆయనో ఫాంహౌజ్‌.. కొడుకో ఫాంహౌజ్‌.. అల్లుడో ఫాంహౌజ్‌.. బిడ్డో ఫాంహౌజ్‌ మాత్రం కుట్టుకున్నారు. వాస్తు మంచిగ లేదని ప్రగతి భవన్‌, సచివాలయం కట్టాడు. వచ్చే ఎన్నికల్లో నువ్వో నేనో చూసుకుందాం కేసీఆర్‌! ప్రజా పాలనా.. పాపాల భైరవుడా!? రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు ఇప్పుడున్న ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటా’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సవాల్‌ చేశారు. కేసీఆర్‌ చేసిన పాపాలకు ఇదే ఆటవిక రాజ్యమైతే.. అడవిలో ఆయనను చెట్టుకు ఉరేసినా తప్పు లేకుండా పోయేదని మండిపడ్డారు. నిజాం సర్కార్లో అయితే కేసీఆర్‌ను చెట్టుకు కట్టేసి కొట్టేవారన్నారు. భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని నస్తురుపల్లిలో సోమవారం జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అంతకు ముందు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఇతర మంత్రులతో కలిసి రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రైతు భరోసా పథకంలో భాగంగా రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. మొదటి, రెండు విడుతల్లో కలిపి రూ.5,700 కోట్లు జమ చేశామని, ఇంకో రూ.3,300 కోట్లు జమ చేస్తామని చెప్పారు. వ్యవసాయం దండగ కాదు.. పండగ చేయాలనే గొప్ప సంకల్పం తీసుకున్నామన్నారు. రైతులు పండించిన సన్న వడ్లను 3.15 కోట్ల మంది పేదలకు సన్న బియ్యంగా అందిస్తున్నామన్నారు. ‘‘స్వాతంత్రం వచ్చిన నాటి నుండి గొప్పలు చెప్పుకునేవాళ్లు పేదవాళ్లకు సన్నబియ్యం ఇయ్యాలనే ఆలోచన చేసిర్రా!? గడీల్లో ఉండి బిర్యానీలు తినుకుంటూ దొడ్డు బియ్యం ఇచ్చారు. ఆనాడుసమ్మక్క సారలమ్మ సాక్షిగా నేను, ఆదిలాబాద్‌లో భట్టి విక్రమార్క చేసిన పాదయాత్రల్లో భాగంగా ఇచ్చిన మాట ప్రకారం.. ఏడాది తిరిగేలోగా రైతు రుణమాఫీ చేశాం. దేశానికే ఆదర్శంగా నిలబడ్డాం’’ అని వ్యాఖ్యానించారు.

4.jpg


ప్రజా పాలన పోవాల్నా..

‘‘పేదల కళ్లలో ఆనందం చూస్తున్నందుకు ప్రజా పాలన పోవాల్నా!? ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు పోవాల్నా..? తెలంగాణ ఉద్యమంలో సమిధలైన శ్రీకాంతచారి, కిష్టయ్య ఆలోచనలతో ఏడాదిలోనే 70 వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు పోవాల్నా.. సన్న బియ్యం ఇస్తునందుకు పోవాల్నా!? 200 యునిట్ల ఉచిత కరెంట్‌ ఇస్తున్నందుకు పోవాల్నా? రూ.21 వేల కోట్ల రైతు రుణమాఫీ చేసినందుకు పోవాల్నా, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నందుకు పోవాల్నా!? బ్యాంకు లింకేజీ రుణాలు ఇస్తూ కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకుంటున్నందుకు పోవాల్నా, వేములవాడ, బాసర సరస్వతి, కాళేశ్వరం క్షేత్రం, భద్రాచలం రాముల వారి గుడిని అభివృద్ధి చేస్తున్నందుకు పోవాల్నా!?’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. డబుల్‌ బెడ్‌రూం ఇస్తామని డబ్బా ఇళ్లు ఇచ్చాడని కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. ఆనాడు బతుకమ్మ పేరిట ఇచ్చిన చీరెలను పొలాలకు కట్టుకున్నారని, నేడు సీతక్క నేతృత్వంలో ఇచ్చిన చీరలతో ఆడపడుచులు పాలపిట్టల్లా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎంత మందినైనా తొక్కుకుంటూపోతామని వ్యాఖ్యానించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లు గెలిచి రాహుల్‌ను ప్రధాన మంత్రిని చేసుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ప్రతిపక్షాలను వంద కిలో మీటర్ల గొయ్యి తీసి పాతిపెడదామని అన్నారు. ‘‘ఎంపీ ఎన్నికల్లో, సర్పంచ్‌ ఎన్నికల్లో, జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాం. వచ్చేసారి కూడా జెండా ఎగరేస్తాం’’ అని స్పష్టం చేశారు. 2024 నుంచి 2034 వరకు ప్రజా పాలన ఉంటుందని, నాడు వైఎస్సార్‌-డీఎస్‌ల మాదిరిగా ప్రస్తుతం తాను, మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. ‘ఔర్‌ ఏక్‌ బార్‌.. కాంగ్రెస్‌ సర్కార్‌’ అంటూ బహిరంగ సభకు హాజరైన కార్యకర్తలతో నినాదాలు చేయించారు.

5.jpg


శత్రువు పంచన చేరతావా!?

ఒక్క ఏడాది పదవి లేకపోతే కాంగ్రెస్‌ కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేరతావా!? అంటూ మాజీ మంత్రి జీవన్‌ రెడ్డిపై సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు పెద్ద మనిషి అని పిలిపించుకునే అర్హతా ఉందా!? అని ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్‌ పార్టీ ఏం తక్కువ చేసింది!? 14 సార్లు బీఫాం ఇచ్చింది. 11 సార్లు ఎమ్మెల్యే, ఒక్కోసారి ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి గెలిపించుకుంది. 40 ఏళ్లు నీ కోసం, నీ కుటుంబం కోసం కార్యకర్తలు వెన్నుగా నిలిచారు. లక్షలాది మంది కార్యకర్తలు రక్తాన్ని చెమటగా మార్చడం వల్ల మువ్వన్నెల జెండా ఎగిరింది. నీ నెత్తిమీద దరిద్రం ఉండి ఓడిపోతే.. ప్రజాపాలన పోవాల్నా!? వెనక్కి వెళ్లి పుట్టు పూర్వోత్తరాలు తవ్వితే నీ నిజ స్వరూపం తెలుస్తుంది. ఇందుకు మంత్రి తుమ్మల సజీవ సాక్ష్యం. ఆనాడు అన్నగారు ఎన్టీఆర్‌ భుజం తట్టి ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి.. ఎక్సైజ్‌ శాఖ మంత్రిని చేస్తే నాదెండ్ల భాస్కర్‌ రావుతో జత కట్టి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పోడిచావు’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నీకు సిగ్గు శరం ఉందా.. అని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌, సీతక్క, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

6.jpg

Updated Date - Apr 21 , 2026 | 04:08 AM