కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Mar 03 , 2026 | 08:02 PM
కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, కార్పొరేటర్లు, మేయర్లు తప్పనిసరిగా..
హైదరాబాద్, మార్చి 3: కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రమాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, కార్పొరేటర్లు, మేయర్లు తప్పనిసరిగా భాగస్వాములవ్వాలని ఆదేశించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు జిల్లా కేంద్రాల్లో ఒకరోజు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా సోలార్ విద్యుత్ వినియోగంపై గ్రామాల వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు సీఎం. రైతులకు సోలార్ పంప్ సెట్లు ప్రోత్సాహం అందిస్తామన్నారు.
ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలు గ్రామ, వార్డు సభల్లో ప్రజలకు వెల్లడించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ మెడికల్ కాలేజీల సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీఎం రేవంత్ ఆదేశించారు. అన్ని సంక్షేమ పథకాలలో ఫేషియల్ రికగ్నిషన్ అమలు చేయాలని.. అనర్హులను తొలగించాలని దిశానిర్దేశం చేశారు. రవాణా శాఖ డేటా పూర్తిగా ఆన్‌లైన్ చేయాలని.. డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించాలన్నారు. రోడ్ల గుంతల సమాచారం కోసం ప్రత్యేక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేయాలన్న సీఎం.. ఓఆర్ఆర్, సర్వీస్ రోడ్లపై చెత్త డంపింగ్ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
స్కూళ్లలో మధ్యాహ్న భోజన ఏజెన్సీల బిల్లులు ప్రతి నెలా సమయానికి చెల్లించాలన్నారు. నగరాల్లో వర్కింగ్ ఉమెన్స్, బాయ్స్-గర్ల్స్ హాస్టళ్ల నమోదు, పర్యవేక్షణ ఉండాలన్నారు. పాఠశాలలు, కాలేజీల్లో డ్రగ్స్, గంజాయి వినియోగంపై విద్యాసంస్థలు కఠినంగా ఉండాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలో సైకాలజిస్టులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
భూసార పరీక్షలు చేసి రైతులకు సరైన పంటలపై మార్గదర్శనం ఇవ్వాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. యూరియా యాప్ సులభీకరణ, నానో యూరియా ప్రయోజనాలపై క్షేత్ర స్థాయి ప్రదర్శనలు చేపట్టాలన్నారు. వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు సీఎం. జిల్లాల వారీగా పంటల వైవిధ్యంపై కలెక్టర్లు నివేదికలు సమర్పించాలన్నారు.
Also Read:
ఇరాన్ దిగి వచ్చింది.. కానీ ఇప్పటికే ఆలస్యమైంది: ట్రంప్
ఐపీఎల్ 2026: బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు ఆడనున్న ఆర్సీబీ
ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై దాడి.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ వెల్లడి