Share News

బోధనాస్పత్రులు అధికారుల చేతికి..

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:02 AM

ప్రభుత్వ ఆస్పత్రులు, వాటి అనుబంధ వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యతను గ్రూప్‌-1, 2 అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు....

బోధనాస్పత్రులు అధికారుల చేతికి..

  • ఇందుకు ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు

  • డాక్టర్లకు కేవలం చికిత్సలు, రోగుల బాధ్యతే

  • టీచింగ్‌ కాలేజీలకూ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌

  • అక్కడి ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే ఇన్సెంటివ్‌లు

  • విద్య, వైద్యానికి ఒక్క రూపాయి కూడా కోత పెట్టం

  • మా హయాంలో ఆస్పత్రుల బకాయిలు 127 కోట్లే

  • గత సర్కారు బకాయిలను కలిపితే రూ.727 కోట్లు

  • ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించాల్సింది 231 కోట్లే

  • వాటిలో చికిత్సలు చేయడం లేదనేది అపోహే

  • గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌నూ తినేశారు

  • శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆస్పత్రులు, వాటి అనుబంధ వైద్య కళాశాలల నిర్వహణ బాధ్యతను గ్రూప్‌-1, 2 అధికారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రకటన చేశారు. ‘‘పెద్ద పెద్ద చదువులు చదువుకున్న డాక్టర్లకు ఆస్పత్రుల నిర్వహణ బాధ్యతలు ఇస్తే.. ఊడ్చేవాళ్లు.. తుడిచేవాళ్లు.. మిగతా సిబ్బంది వచ్చిన్రా లేదా అని చూసుకోవడానికే సరిపోతోంది. రోగులకు చికిత్స చేయడంతోపాటు నర్సు వచ్చిండా.. వాచ్‌మెన్‌ వచ్చిండా.. పార్కింగ్‌ ఎలా ఉంది తదితరాలన్నీ చూసుకోవాల్సి వస్తోంది. వాళ్లు చదువుకున్న చదువుకు, మైండ్‌ సెట్‌కు, వాళ్ల వ్యవహార శైలికి ఈ బాధ్యత సరిపోదు. చికిత్సను, ఆస్పత్రి నిర్వహణను వేరు చేయాలనుకుంటున్నాం. ఇందుకు ప్రత్యేకంగా ఒక వింగ్‌ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేకంగా గ్రూప్‌-1, 2 అధికారులను నియమించి నిర్వహణ బాధ్యత అప్పగిస్తాం. రోగులకు చికిత్స బాధ్యతను ప్రొఫెషనల్‌ డాక్టర్లకు అప్పగించాలనుంటున్నాం’’ అని ప్రకటించారు. వైద్యాన్ని, ఆస్పత్రుల నిర్వహణను వేరు చేయాలని అనుకుంటున్నామని చెప్పారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ అంశంపై బీఆర్‌ఎస్‌ ఉప నేత హరీశ్‌ రావుతోపాటు పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు గురువారం సీఎం రేవంత్‌ రెడ్డి జవాబిచ్చారు. ‘‘నిధుల సమస్య వస్తే ఇంకెక్కడైనా కోత విధిస్తాం. కానీ, పేదల విద్య, వైద్యం విషయంలో ఒక్క రూపాయి కూడా కోత పెట్టం. విద్య, వైద్యమే మా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం.


ప్రజలకు పోషకాహారాన్ని అందించనున్నాం. నాణ్యమైన, నైపుణ్య విద్యనూ అందిస్తాం. ఇందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం’’ అని తెలిపారు. రాష్ట్రంలోని టీచింగ్‌ కాలేజీలకు ఆరోగ్యశ్రీ రోగులు రావడం లేదని, రోగులు వెళ్లే ఆస్పత్రుల్లో నిపుణులు లేరని, ఈ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తున్నామని చెప్పారు. టీచింగ్‌ కాలేజీలకు ఆరోగ్యశ్రీ రోగులను పంపించాలని భావిస్తున్నామని, అప్పుడు అక్కడి విద్యార్థులకూ మరింత అవగాహన పెరుగుతుందని తెలిపారు. టీచింగ్‌ ఆస్పత్రులకూ ఆరోగ్యశ్రీ, సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఇస్తామని, అక్కడ చికిత్సలు చేసే ప్రొఫెసర్‌ డాక్టర్లకు ప్రత్యేక ఇన్సెంటివ్‌లు ఇవ్వాలని భావిస్తున్నామని వెల్లడించారు.

ఆరోగ్యశ్రీ కింద నెలకు రూ.89 కోట్లు

‘‘ఆరోగ్యశ్రీ కింద 2014 నుంచి 2023 డిసెంబరు 6వ తేదీ దాకా ప్రతినెల సగటున గత ప్రభుత్వం రూ.52 కోట్లు ఖర్చు పెట్టింది. మేం గత 27 నెలలుగా ప్రతినెల రూ.89 కోట్లు ఖర్చు పెట్టాం. బకాయిల వారసత్వం వారి (బీఆర్‌ఎస్‌) నుంచే వచ్చిందే. వాళ్ల బకాయిల భారాన్ని మోస్తూనే.. ఈ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పరిమితిని పెంచాం. మేం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకూ రూ.2,408 కోట్ల చెల్లింపులు చేశాం. ఇందులో ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.927.99 కోట్లు, ప్రైవేట్‌ ఆస్పత్రులకు రూ.1480.52 కోట్లు చెల్లించాం. ప్రస్తుతం రూ.727.75 కోట్ల బకాయిలున్నాయి. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన బకాయిలు తీసేస్తే.. మా ప్రభుత్వ హయాంలో చెల్లించాల్సిన బకాయిలు రూ.127 కోట్లే. పాత బకాయిలను వదిలించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం’’ అని సీఎం రేవంత్‌ రెడ్డి వివరించారు. వీటిలోనూ ప్రభుత్వ ఆస్పత్రులకే రూ.496 కోట్ల బకాయిలు ఉన్నాయని, ప్రైవేట్‌ ఆస్పత్రుల బకాయిలు కేవలం రూ.231 కోట్లు మాత్రమేనని, ప్రైవేట్‌లో బకాయిలు తక్కువేనని చెప్పారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం లేదనేది అపోహ మాత్ర మే అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను కూడా దుర్వినియోగం చేశారని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. 27 నెలల్లో రూ.2,046 కోట్లు సీఎం రిలీవ్‌ ఫండ్‌ కింద ఇచ్చామని, ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన రూ.2,400 కోట్లను కలుపుకొంటే పేదల వైద్యానికి రూ.4,500 కోట్లను ఖర్చు చేశామని వివరించారు.


ప్రభుత్వ ఆస్పత్రుల్లో విదేశీ వైద్యం

తెలంగాణ నుంచి కొన్ని వేలమంది విదేశాల్లో డాక్టర్లుగా స్థిరపడ్డారని, వాళ్లు తల్లిదండ్రులను చూడడానికో.. జన్మభూమిని చూడటానికో వచ్చినప్పుడు నాలుగైదు రోజులు కుటుంబ వ్యవహారాలు చూసుకున్న తర్వాత ఒక 20 రోజులు అదనంగా ఉంటే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సకు ఉపయోగించుకునేలా వేదికను తయారు చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. వారందరి కోసం ఓ వెబ్‌సైట్‌ తయారు చేస్తున్నామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వారి సేవలను వినియోగించుకునేలా డాక్టర్లతో చర్చించి ఓ కొలిక్కి తెచ్చామని తెలిపారు. ఇక్కడి మెడికల్‌ కాలేజీలకు వారి అనుభవాన్ని పంచే అవకాశం ఇవ్వనున్నామన్నారు. అలాగే, ఇప్పటిదాకా నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్సకే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) ఇస్తున్నామని, ఇకముందు టిమ్స్‌ (ఎల్బీనగర్‌, అల్వాల్‌, సనత్‌నగర్‌), ఉస్మానియా, కాకతీయ మెడికల్‌ కాలేజీలకు కూడా ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆయా ఆస్పత్రులను కూడా బాగు చేసి, ఆరోగ్యశ్రీతోపాటు సీఎం రిలీవ్‌ ఫండ్‌ నిధులు ఇవ్వనున్నామని ప్రకటించారు. మంత్రి దామోదర రాజనర్సింహ సామాజిక వైద్యుడని, వైద్యంపై సంపూర్ణ అవగాహన ఉందని, క్వాలిఫైడ్‌ పర్సనే ఆ శాఖను నిర్వహిస్తున్నారని కితాబునిచ్చారు.

ఆరోగ్యశ్రీ కింద గ్రీన్‌ చానల్‌లో నిధులు: రాజనర్సింహ

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద గ్రీన్‌ చానల్‌లో నిధులు విడుదల చేస్తున్నామని, 1,375 రకాల చికిత్సల ధరలను సవరించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఏరియా ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రధానంగా కార్డియాలజీకే ప్రతినెల రూ.50 కోట్లు వెచ్చిస్తున్నామని, ఆ తర్వాత ఆంకాలజీ, నెఫ్రాలజీ ఉన్నాయన్నారు. టీచింగ్‌ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామని, 90 శాతం దాకా చికిత్సలు జిల్లా స్థాయిలోనే జరగాలనేది ప్రభుత్వ నిర్ణయమని తెలిపారు.

బకాయిలు చెల్లించాలి: హరీశ్‌ రావు

బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు అందించిన ఆస్పత్రులు మూతపడే ప్రమాదం ఉందని బీఆర్‌ఎస్‌ పక్ష ఉపనేత హరీశ్‌ రావు అన్నారు. గ్రీన్‌ చానల్‌లో ఆరోగ్యశ్రీ నిధులు చెల్లిస్తామని చెప్పినా.. ఇప్పటిదాకా అమలు చేయలేదన్నారు. ఆరోగ్యశ్రీ మంచి పథకమని, గత ప్రభుత్వం దీన్ని రద్దు చేయకుండా కొనసాగించిందని, ప్రభుత్వం తక్షణమే బకాయిలు చెల్లించాలన్నారు.’


వైద్య సేవలకే డాక్టర్లు పరిమితం

బోధనాస్పత్రులను ఇప్పటి వరకూ అదనపు వైద్య విద్య సంచాలకుల హోదా (అడిషనల్‌ డీఎంఈ) ఉన్న సీనియర్‌ వైద్యులే నిర్వహిస్తున్నారు. అప్పటి దాకా వైద్యం చేసి, పదోన్నతులు రావడంతో ఒక్కసారిగా మెడికల్‌ కాలేజీల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లు అవుతున్నారు. దీంతో వారికి పాలన వ్యవహారాలపై పట్టు చిక్కడం లేదు. రోజూవారీ వ్యవహారాలను కూడా చక్కబెట్టలేకపోతున్నారని ప్రభుత్వానికి నివేదికలు వచ్చాయి. గత రెండేళ్లలో చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు ఉదాహరణ. వార్డుల్లోకి ఎలుకలు రావడం, కుక్కలు తిరగడం, శానిటేషన్‌ సరిగ్గా లేకపోవడం వంటి ఘటనలు నిత్యం జరుగుతున్నాయి. ఒకవైపు వైద్య సేవలందిస్తూనే మరోవైపు పాలన వ్యవహారాలను చక్కబెట్టడం సూపరింటెండెంట్లకు తలకు మించిన భారంగా మారింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఆస్పత్రుల నిర్వహణ బాధ్యతను అధికారులకు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాఽధికారులు తెలిపారు. అధికారులు పారిశుద్ధ్యం, రక్షణ, రోగుల భద్రతతోపాటు రోజూవారీ పాలన వ్యవహారాలు చూస్తారని, వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది విధులు, సర్జరీలు, ఇతర వైద్య సేవల వ్యవహారాలన్నీ సూపరింటెండెంట్లే పర్యవేక్షిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం..

  • అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం

  • ఆర్థికవేత్త కార్తీక్‌ మురళీధరన్‌తో సీఎం

రాష్ట్రంలో ప్రతీ చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఆ అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని వివరించారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్‌ మురళీధరన్‌ గురువారం సీఎం రేవంత్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలోని శాసనమండలి హాల్‌లో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రి సీతక్కతో కలిసి చర్చించారు. తెలంగాణలో పదేళ్లలోపు పిల్లల్లో పోషకాహారం, విద్యాభ్యాస స్థాయి, సామర్థ్య లోపాలకు సంబంధించి పలు నివేదికలను కార్తీక్‌ ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహారాన్ని అందించేందుకు ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా మరొకరిని నియమించాలని కార్తీక్‌ సూచించగా, పోషణ సఖి పేరుతో మరొకరిని నియమించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కార్తీక్‌ సూచించే అంశాలను కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని 29 స్కూల్‌ కాంప్లెక్స్‌ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలుచేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్‌ అధికారులకు సూచించారు. కార్తీక్‌తో సమన్వయం చేసుకుని ఈ అంశంపై ప్రత్యేక నివేదిక సమర్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Updated Date - Mar 27 , 2026 | 04:02 AM