‘నేనే రాజు.. నేనే మంత్రి’ వ్యాఖ్యలను వక్రీకరించారు: సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Feb 15 , 2026 | 02:05 PM
గిరిజనుల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు..
హైదరాబాద్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని అన్ని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రహదారులు లేని తండాలే ఉండకూడదన్నారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని బంజారా భవన్‌లో సంత్ శ్రీ సేవాలాల్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి లక్ష్మణ్‌తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో లంబాడా యువకులు ప్రత్యేక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ప్రతి తండాలో ప్రభుత్వ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. 4 నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు.
గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. 100 నియోజకవర్గాల్లో రూ. 20 వేల కోట్లతో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. బాగా చదువుకుంటే.. భవిష్యత్ తరాలు బాగుపడతాయని సూచించారు. చదువు వల్ల కీలక పదవులు వస్తాయంటూ గిరిజన యువతకు సోదాహరణగా వివరించారు. నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లండి.. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని సీఎం వారికి భరోసా ఇచ్చారు.
తాము పాలకులం కాదని.. సేవకులమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసి వారికి మేలు చేశామన్నారు. దళితులకు నాలుగు మంత్రులు, స్పీకర్ పదవి ఇచ్చామని వివరించారు. గతంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ దళితుడికి సీఎం పదవి ఇస్తానని మాట తప్పారంటూ మండపడ్డారు. దళితుడిని స్పీకర్ చేసి అధ్యక్షా అని పిలిచేలా తాను చేశానన్నారు. ప్రజా తీర్పును అవమానించేలా మాట్లాడవద్దంటూ హితవు పలికారు. నేనే రాజు.. నేనే మంత్రి అంటూ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు తనదే బాధ్యత అని చెప్పానని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. గెలిస్తే పొంగిపోవడం.. ఓడిపోతే కుంగిపోవడం తనకు తెలియదన్నారు. వచ్చే 20 ఏళ్లు కూడా పేదల సంక్షేమం కోసం తాను పని చేస్తానంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
శివరాత్రి పూజలో పాల్గొన్న ఏబీఎన్ డైరెక్టర్స్ అనూష, భాను ప్రకాష్
ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే భరోసా, నమ్మకం: మంత్రి లోకేశ్
For TG News And Telugu News