ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..
ABN , Publish Date - May 02 , 2026 | 07:34 PM
వంద రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.6వేల కోట్లు చెల్లిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యతలు ఉద్యోగులే నిర్ణయిస్తారని చెప్పారు.
హైదరాబాద్: వంద రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం రూ.6వేల కోట్లు చెల్లిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నిధుల ఖర్చు ప్రాధాన్యాలను ఉద్యోగులే నిర్ణయిస్తారని చెప్పారు. ఉద్యోగుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం భరోసా ఇచ్చారు. ఈ మేరకు సంఘాల నాయకులతో ఈరోజు (శనివారం) సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగులకు పలు హామీలు ఇచ్చారు. పీఆర్సీపై తక్షణమే రిపోర్టు అందించాలని అధికారుల కమిటీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రిపోర్టు ఆధారంగా పీఆర్సీపై నిర్ణయం తీసుకుంటామని రేవంత్ భరోసా ఇచ్చారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రతా కార్డులనూ ఉద్యోగులకు అందిస్తామని హామీ ఇచ్చారు. రెండు నెలలకోసారి గుర్తింపు సంఘాలు సమావేశమై సమస్యలపై ప్రభుత్వానికి రిపోర్టు అందించాలని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రకటించినా ఉద్యోగులు భుజాన వేసుకుని పని చేశారని ప్రశంసించారు. వారి సహకారంతోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేయగలుగుతున్నామని కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల కోసమే మొదటి నిర్ణయం తీసుకున్నామని గుర్తు చేశారు.
ఉద్యోగులకు ప్రతీ నెలా మొదటి తారీఖునే జీతాలు అందేలా చర్యలు చేపట్టినట్లు రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఉద్యోగ సంఘాలు స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించామన్నారు. ఉద్యోగుల బదిలీల విషయంలో గందరగోళం తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం చేసినట్లు చెప్పుకొచ్చారు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలనూ ఎలాంటి వివాదం లేకుండా పూర్తి చేశామన్నారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతా కార్డుల ప్రతిపాదనపైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ రెండేళ్ల ప్రజా ప్రభుత్వంలో 67,760 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు ఆయన చెప్పుకొచ్చారు. 'ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం.. మీ సమస్యలను పరిష్కరించే బాధ్యత మాది' అంటూ సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు.
సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అనంతరం తమ నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ మారం జగదీశ్, TGEJAC ఛైర్మన్ లచ్చిరెడ్డి ప్రకటించారు. ఈనెల 5న నిర్వహించనున్న నిరసన కార్యక్రమంతోపాటు అన్ని రకాల ఆందోళనలూ ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఉద్యోగ సంఘాల డిమాండ్లపై సీఎం రేవంత్ స్పష్టత ఇవ్వడంపై ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా
బతుకమ్మ కుంట వివాదంపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..