బతుకమ్మ కుంట వివాదంపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్..
ABN , Publish Date - May 02 , 2026 | 05:04 PM
హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంట చెరువు భూమి తనదే అంటూ హైకోర్టును ఎడ్ల సుధాకర్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా స్పందించారు.
హైదరాబాద్: బతుకమ్మ కుంట చెరువు భూమి తనదే అని, అక్కడ తాను వ్యవసాయం కూడా చేసినట్లు హైకోర్టును ఎడ్ల సుధాకర్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ అంశం ఇటీవల పెద్దఎత్తున చర్చకు తెరలేపింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా స్పందించారు. బతుకమ్మ కుంటను హైడ్రా అభివృద్ధి చేయడంపై ఎడ్ల సుధాకర్ పిటిషన్ వేశారని తెలిపారు. 1986 నాటి అన్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ మాత్రమే ఆయన వద్ద ఉందని.. రిజిస్టర్డ్ అగ్రిమెంట్ ఉంటేనే రూల్ ప్రకారం చెల్లుబాటు అవుతుందని రంగనాథ్ అన్నారు.
బతుకమ్మ కుంట అభివృద్ధిపై డివిజన్ బెంచ్‌కు సుధాకర్ వెళ్లారని.. కంటెంప్ట్ ఆర్డర్‌లో కోర్టు తమను తప్పుపట్టిందని హైడ్రా కమిషనర్ చెప్పారు. డివిజన్ బెంచ్ ఆదేశాల ప్రకారం అక్కడ బోర్డులు, ఇతర నిర్మాణాలు తొలగించామని వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలను తాము పాటిస్తామని స్పష్టం చేశారు. సుధాకర్ అసలు అక్కడ చెరువే లేదని అంటున్నారని.. కానీ 1990 నాటి నాసా శాటిలైట్ ఫొటోల్లో బతుకమ్మ కుంట కనిపిస్తోందన్నారు. 1970లో భారతీయ సర్వే ఆఫ్ ఇండియా నీటి సర్వేల్లోనూ పూర్వం నుంచే చెరువు ఉన్నట్లు తేలిందన్నారు. ఎర్రకుంట పేరుతో 1975 పహనీలలో 563/-1తో బతుకమ్మ కుంట ఉందన్నారు.
సుధాకర్ భూమిని చెరువుగా మార్చామనేది నిజం కాదని.. తమ వద్ద ఉన్న అన్ని ఆధారాలను కోర్టుకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు నార్సింగ్‌లోని ముష్కిమ్ చెరువు ఆక్రమణ కూల్చివేతలపై ముందుగానే సమాచారం ఇచ్చామని హైడ్రా కమిషనర్ తెలిపారు. సున్నం చెరువు బాధితులతో సమావేశం ఏర్పాటు చేశామని.. సీఎం ఆదేశాలతో వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా ఇస్తున్నట్లు వెల్లడించారు. ఐలాపూర్‌లో ప్రభుత్వ భూమి ఆక్రమణలపైనా డ్రైవ్ చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ హైడ్రా 2,093 ఎకరాల భూమిని రికవరీ చేసిందన్నారు.
ఇప్పుడున్న మార్కెట్ ధర ప్రకారం ఆ భూముల విలువ రూ.80 వేల కోట్ల వరకు ఉంటుందని రంగనాథ్ తెలిపారు. హైడ్రా పరిధిలో 90 ఎఫ్ఐఆర్‌లు ఇప్పటివరకు నమోదయ్యాయని వెల్లడించారు. ఫాతిమా కాలేజ్ విషయంలో హైకోర్టు ఆదేశాలతో ఎఫ్‌టీఎల్ డిమార్కింగ్ చేయాలని రంగనాథ్ చెప్పుకొచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
కిందస్థాయి సిబ్బందితో ఫ్రెండ్లీగా ఉండండి.. ఆర్టీసీ అధికారులతో పొన్నం ప్రభాకర్
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డిపై పరువు నష్టం దావా