Share News

డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభానికి రాజ్‌నాథ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:41 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రుకావాల‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.

డిఫెన్స్ ఎక్స్‌పో ప్రారంభానికి రాజ్‌నాథ్‌ను ఆహ్వానించిన సీఎం రేవంత్
TG CM Revanth Reddy Meeting With Defence Minister Rajnath singh

ఢిల్లీ, సెప్టెంబర్ 02: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026కు హాజ‌రుకావాల‌ని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీ వేదికగా ఈ స‌ద‌స్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ స‌దస్సులో భాగంగా నిర్వహించే రక్షణ ఎక్స్‌పో - 2026ను ప్రారంభించాలని రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.


ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం రక్షణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వీరు చర్చించారు. రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, స్పేస్‌ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతో పాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌ షో, పారిశ్రామిక ప్రదర్శన, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.


దేశవ్యాప్తంగా రక్షణ రంగంలోని పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే రక్షణ ఎక్స్‌పోకు హాజరై మార్గనిర్దేశం చేస్తే, వారికి ఎంతో స్ఫూర్తిదాయ‌కంగా ఉంటుంద‌ని రాజ్‌నాథ్‌సింగ్‌తో సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే రక్షణ ఎక్స్‌పో - 2026కు స్వాగతం పలికేందుకు త‌మ ప్రభుత్వం ఎదురుచూస్తోందని అన్నారు.


రక్షణ ఎక్స్‌పో-2026ను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు సహ‌క‌రించాల‌ని రాజ్‌నాథ్ సింగ్‌కు తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతో పాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్‌, సారంగ్‌ ఏరోబాటిక్‌ బృందాలు ఈ ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని ఆయనను కోరారు. స్టాటిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రదర్శనకు కూడా సహక‌రించాల‌న్నారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాల‌ని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగ‌స్వామ్యం కావాల‌ని సీఎం రేవంత్ కోరారు.


హెచ్‌ఏఎల్‌, బీఈఎల్‌, బీడీఎల్‌, ఎండీఎల్‌ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాల‌ని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.


ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎక‌రాలు భూసేక‌ర‌ణ చేపట్టింద‌ని రాజ్‌నాథ్ సింగ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. రక్షణ శాఖ మొత్తం1,500 ఎక‌రాలు కోరిందని.. మ‌రో 750 ఎక‌రాలు సేక‌రించి ఇచ్చేందుకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు.


మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలో డీఆర్‌డీఎల్‌ ఆధ్వర్యంలో చేప‌ట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్పటికే టీజీఐఐసీ అంగీక‌రించింద‌ని రక్షణ శాఖ మంత్రికి రేవంత్ రెడ్డి వివరించారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజు అద్దెతో 33 సంవత్సరాలకు ఈ భూమిని కేటాయించనున్నట్లు వివరించారు. అవ‌స‌ర‌మైతే దానిని మ‌రో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవ‌కాశం ఉంద‌ని అన్నారు. ఈ స‌మావేశంలో మంత్రి జి. వివేక్ వెంక‌ట‌స్వామి, ఎంపీలు ఎం. అనిల్ కుమార్ యాద‌వ్‌, డాక్టర్ మ‌ల్లు రవి, సురేశ్ షెట్కార్‌, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, రాష్ట్ర ప్రభుత్వ స‌ల‌హాదారు (ప్రొటోకాల్‌) హ‌ర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

టీటీడీ డిప్యూటీ ఈవో నివాసంలో ఏసీబీ సోదాలు

గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. 48 గ్రాముల బంగారం రికవరీ

Read Latest TG News And Telugu News

Updated Date - Sep 02 , 2026 | 02:07 PM