CM Chandrababu: కొణిజేటి రోశయ్య కుటుంబాన్ని పరామర్శించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 14 , 2026 | 08:33 PM
తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మీ మృతి చెందారు. ఆమె వయస్సు 86 సంవత్సరాలు.
అమరావతి, జనవరి14: దివంగత మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) మరణించారు. ఈ నేపథ్యంలో కొణిజేటి రోశయ్య కుటుంబ సభ్యులను సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శించారు. బుధవారం హైదరాబాద్‌లోని రోశయ్య కుమారుడు శివకు సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు నాయుడు తన సానుభూతి తెలియజేశారు. రోశయ్య కుటుంబంతో తనకు ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకున్నారు.
కొణిజేటి రోశయ్య సతీమణి శివలక్ష్మి (86) సోమవారం ( 12-01-2026) హైదరాబాద్ అమీర్‌పేటలోని తమ నివాసంలో మృతి చెందారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్ పరిధిలోని రోశయ్యకు చెందిన ఫామ్‌హౌస్‌లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. రోశయ్య దంపతులకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వేమూరుకు చెందిన శివలక్ష్మిని కొణిజేటి రోశయ్య వివాహం చేసుకున్నారు.
రోశయ్య రాజకీయంగా ఎదుగుదలలో ఆమె అడుగడుగునా ఆయనకు అండగా నిలిచారు. శివలక్ష్మి మరణవార్త తెలియగానే పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో రోశయ్య నివాసానికి తరలి వచ్చారు. సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర కలిగిన రోశయ్య.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశ పెట్టి రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా, తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌గా గతంలో ఆయన పని చేశారు. 2021, డిసెంబర్ 4వ తేదీన కొణిజేటి రోశయ్య మరణించిన సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..
For More AP News And Telugu News