Chandrababu: ఏపీ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:41 PM
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. రైతన్నలు ఆనందంగా ఉండాలని, కష్టజీవులు శ్రమకు తగిన ఫలితం పొందేందుకు అనువైన పథకాలతో బాధ్యతగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 14: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు. కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి తన స్వగ్రామం నారావారిపల్లిలో ఉన్నారు. కుటుంబసమేతంగా గ్రామానికి చేరుకుని సందడి చేస్తున్నారు. నారా ఫ్యామిలీతోపాటు నందమూరి కుటుంబం సైతం చంద్రబాబు స్వగ్రామం వెళ్లి ఆనందంగా గడుపుతున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు.
'సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పవిత్ర పర్వదినం మకర సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. విశిష్టమైన ఈ సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాడిపంటలతో పల్లె సీమలు మరింత కళకళలాడాలని, ఆధునికతను సంతరించుకున్నప్పటికీ, మన సంప్రదాయాలను మరచిపోకుండా పాటించాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రైతన్నలు ఆనందంగా ఉండాలని, కష్టజీవులు శ్రమకు తగిన ఫలితం పొందాలని, అందుకు అనువైన పథకాలతో ప్రభుత్వం మరింత బాధ్యతతో వ్యవహరిస్తుందని హామీ ఇస్తున్నాను. సంక్రాంతి పండుగ ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మరొక్కమారు అందరికీ శుభాకాంక్షలు' అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ ద్వారా సందేశమిచ్చారు.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..